Andhra Pradesh: సృజన మృతి కేసులో వీడిన మిస్టరీ.. ప్రియుడి కోసం అలా.. వెలుగులోకి సంచలన విషయాలు

మధురవాడలో పెళ్లి పీటలపైనే అనుమానాస్పదంగా మృతి చెందిన సృజన మరణం వెనుక మిస్టరీ వీడింది. పోలీసుల విచారణలో...

Andhra Pradesh: సృజన మృతి కేసులో వీడిన మిస్టరీ.. ప్రియుడి కోసం అలా.. వెలుగులోకి సంచలన విషయాలు
Srujana Death Mystery

Updated on: May 23, 2022 | 11:25 AM

మధురవాడలో పెళ్లి పీటలపైనే అనుమానాస్పదంగా మృతి చెందిన సృజన మరణం వెనుక మిస్టరీ వీడింది. పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రేమ వ్యవహారమే సృజన మృతికి కారణమైందని పోలీసులు తేల్చారు. వేరే వ్యక్తితో నిశ్చయించిన పెళ్లిని ఆపే ప్రయత్నంలో సృజన ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. సరిగ్గా పెళ్లికి 3 రోజుల ముందు పరవాడకు చెందిన ప్రియుడు మోహన్‌తో సృజన చాటింగ్ చేసిందని పోలీసులు స్పష్టం చేశారు. సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి సమయం కావాలని మోహన్.. సృజనను కోరగా.. దీనితో ఆమె పెళ్లిని ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి చెప్పింది. అనంతరం పెళ్లి ఆపేందుకు సృజన విషపదార్ధం తిన్నదని.. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సృజన ప్రాణాలు విదిచిందని పోలీసులు వెల్లడించారు.

ఇదీ జరిగింది:

విశాఖపట్నంలోని మధురవాడలో శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. కొద్ది క్షణాల్లో పెళ్లి తంతు ముగుస్తుందనగా.. పెళ్లి కూతురు సృజన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సృజనకు కళ్లు తిరిగాయేమోనని కుటుంబ సభ్యులు ఆమె ముఖంపై నీళ్లు చల్లారు. సృజన ఎంతకీ స్పృహలోకి రాకపోయేసరికి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పెళ్లి కూతురు ప్రాణాలు విడిచిందని డాక్టర్లు నిర్ధారించారు. అంతేకాదు ఆమె శరీరంలో విషపదార్ధాన్ని కూడా గుర్తించారు. అనంతరం పోలీసులకు సృజన బ్యాగులో గన్నేరు పప్పు తొక్కలు లభ్యమయ్యాయి. దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు.. వివిధ కోణాల్లో విచారణ జరపగా.. చివరికి ప్రేమ వ్యవహారమే సృజన మృతికి కారణమైందని తేల్చారు.