క్రికెట్ ఆడే సమయంలో ఓ విద్యార్థి, ముగ్గురు భవన నిర్మాణ కూలీలకూ మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలం బాగానే సాగింది. ఓరోజు వారి మధ్య జరిగిన గొడవలో ఆ విద్యార్థి హత్యకు గురయ్యారు. మృతదేహం కనిపించలేదు. అప్పటి నుంచి ఆ కుర్రాడి ఆచూకీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత ఇటీవల హంతకుల్లో ఒకరు మద్యం మత్తులో ఈ విషయం చెప్పడంతో నిజం బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన పి.శ్రీహర్ష 2018లో వేలివెన్నులోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో దీపావళి పండుగకు దారవరంలోని తాతయ్య శ్యామ్‌సన్ ఇంటికి వచ్చాడు. అంతకుముందు నుంచే క్రికెట్‌లో స్నేహితులైన నిర్మాణ కూలీలు షేక్ రషీద్, ఆదిత్య, మునీంద్రలతో కలిసి నిడదవోలు జూనియర్ కళాశాలకు ఆడుకునేందుకు వెళ్లారు. క్రికెట్ ఆడే సమయంలో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో కోపోద్రిక్తులైన రషీద్, ఆదిత్య, మునీంద్రలు శ్రీహర్షను హత్యత చేయాలిని నిర్ణయించారు. పథకం ప్రకారం శ్రీహర్ష మెడకు తాడు బిగించి హతమర్చారు. మృతదేహాన్ని కళాశాలలోని వినియోగంలో లేని సెప్టిక్ ట్యాంక్‌లో దాచిపెట్టారు. ఏడాది తరువాత ఆ ముగ్గురూ 2019లో కళేబరాన్ని బయటకు తీసి, నిడదవోలు రైల్వే గేటు సమీపంలోని కాలువలో పడేశారు. 2018లోనే శ్రీహర్ష అదృశ్యంపై తండ్రి రత్నకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పటి నుంచి ఈ హత్య కేసు మిస్టరీలా మిగిలిపోయింది. కాగా ఇటీవల రషీద్ తాగిన మైకంలో తనతో జాగ్రత్తగా ఉండాలని.. తనో హత్య చేసినట్లు మిత్రులను హెచ్చరించాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వారు రషీద్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు సంగతి బయట పడింది. రషీద్‌ను అరెస్టు చేశారు. ఆదిత్య, మునీంద్ర పరారీలో ఉన్నారు. డీఎస్పీ శ్రీనాథ్ నిడదవోలు కళాశాలలోని సెప్టిక్ ట్యాంక్‌లో మరికొన్ని ఎముకలను గుర్తించారు. ఎస్సై రమేష్ దర్యాప్తు చేస్తున్నారు.
Also Read