
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలను పక్కదోవ పట్టించి, చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా విచారణ సాగుతోందని.. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివేకా కేసులో వివేకా కూతురు సునీతారెడ్డి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని, సీబీఐ విచారణలో ఉన్న లొసుగులను ఆధారాలతో సహా ఎండగట్టారు. హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరికి సునీత మద్దతుగా నిలబడటం వెనుక మర్మమేంటని ప్రశ్నించారు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని మేము కోర్టును కోరితే, ఆమె మాత్రం లూధ్రా వంటి ఖరీదైన న్యాయవాదులను పెట్టి అతడికి అండగా ఎలా నిలబడతారని నిలదీశారు. హత్య జరిగిన వెంటనే వివేకానంద రాసిన లేఖ గురించి పీఏ కృష్ణారెడ్డి ద్వారా సమాచారం అందినప్పటికీ, పోలీసులు వచ్చే వరకు ఆ లేఖను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. సీబీఐ ముందు సునీత ఒకసారి లేఖ గురించి తెలుసునని, మరోసారి తెలియదని పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని.. ఇలా స్టేట్‌మెంట్లు మార్చడం వెనుక ఉద్దేశం ఏంటి? లేఖను దాచిపెట్టడం నేరం కాదా? అందులో ఉన్న నిజాన్ని ఎందుకు తొక్కిపెట్టారో సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు ‘‘వివేకానందరెడ్డి రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడికి ఆస్తిలో వాటా వెళ్తుందనే భయంతో ఈ హత్య జరిగి ఉండొన్న అవినాష్ రెడ్డి.. ఇది మర్డర్ ఫర్ గెయిన్ కోణం కాదా? ఈ విషయాలపై దర్యాప్తు చేయాలని సునీత ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. “ఈ కేసును వచ్చే ఎన్నికల వరకు లాగడం ద్వారా చంద్రబాబుకు పొలిటికల్ మైలేజ్ ఇవ్వడమే సునీత లక్ష్యంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న కొందరు పెద్దమనుషుల అండతో, టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే న్యాయం గెలిచే రోజు వస్తుందని.. తమని అనవసరంగా నిందించిన వారంతా ముక్కున వేలేసుకునే రోజు దగ్గర్లోనే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరగా ట్రయల్ పూర్తి చేసి నిజాలను ప్రజల ముందు ఉంచాలి అని అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
వివేకానంద రెడ్డి హత్య అనంతరం విచారణలో నిందితులు అనేక విషయాలు చెప్పారు. ‘‘వివిధ లావాదేవీల్లో వైఎస్ వివేకానంద రెడ్డికి డబ్బులు, డైమండ్స్ రూపంలోనూ, ల్యాండ్ సెటిల్మెంట్ రూపంలో రావాల్సి ఉంది. దాని కోసం వివేకానందరెడ్డి కొంత మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టారు. ఆ ఖర్చు పెట్టిన డబ్బు పోయిందీ, రావాల్సిన డబ్బు రాకుండా పోయిందన్న బాధ ఆయనకు ఉంది. అందుకే అందరి మీద కోప్పడేవారని ఉంది. దాని మీద ఎందుకు తదుపరి దర్యార్తు సునీతక్క కోరడం లేదు. మరోవైపు తొలిసారి 161 స్టేట్‌మెంట్‌లో దస్తగిరి.. వివేకానందరెడ్డి గారిని చంపక ముందు డాక్యుమెంట్లు గురించి అడిగామని చెప్పారు. ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో కనుక్కోవడానికి ఆయన్ను తీవ్రంగా కొట్టామని చెప్పారు. ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో కనుక్కున్న తర్వాత అవి తాము అనుకున్నవో కావో తేల్చుకున్న తర్వాతే చంపామని చెప్పాడు. హత్య అనంతరం బయటకు వెళ్లిన తర్వాత రెండు మూడు సార్లు డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లామని కూడా చెప్పాడు.
మీకు అత్యంత ఆప్తుడైన దస్తగిరి ఇంత స్పష్టంగా చెప్పాడు. ఆయన బెయిల్ రద్దు చేయమని మేమే కోర్టులో వేసినా.. మీరు మాత్రం ఆయనకు మద్ధతుగా నిలబడతారు. ఏకంగా లూధ్రా లాంటి న్యాయవాదిని దస్తగిరి తరపున నియమించి మాపై పోరాడతారు. యాంటిస్పేటరీ బెయిలిచ్చినా మీరు అడ్డుకోలేదు. ప్రతి అంశానికి అడ్డుపడే మీరు తానే మీ నాన్నగారిని చంపానని దస్తగిరి చెప్పినా.. ఆయన బెయిల్‌ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అంత కీలకమైన డాక్యుమెంట్లు ఏవని అడగాల్సిన బాధ్యత మీకు లేదా? ఇదే విషయాన్ని అడగడానికి మీకు ఎందుకు నోరు రావడం లేదు? కోర్టును, సీబీఐను అడగాల్సిన బాధ్యత మీకు లేదా?’’ అని అవినాష్ ప్రశ్నించారు.
మీ తల్లి, భర్త అటెండర్‌కు సెలవు ఇచ్చి పంపిస్తే మీరు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడ్డం లేదని సునీతను అవినాష్ ప్రశ్నించారు. ‘‘హత్య జరిగిన రోజు రాత్రి దోపిడీకి గురైన డాక్యుమెంట్లు గురించి కూడా మీరు నోరు మెదపడం లేదు? సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ..కీలకమైన విషయాలను ఇగ్నోర్ చేసే కార్యక్రమం మీరు ఇన్నాళ్లూ చేశారన్నది పచ్చి నిజం. ఈ కేసులో పీఎ కృష్ణారెడ్డి తొలుత మృతదేహాన్ని, లేఖను చూసిన తర్వాత తొలుత సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి బావమరిది, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సొంత సోదరుడు శివప్రకాష్ రెడ్డికి ఆ లేఖ గురించి, చనిపోయిన విషయం కూడా చెప్పాడు. ఆ లెటర్‌లో అంశాలు కూడా మీ అందరికీ చదివి వినిపించాడు. కానీ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత అక్కడున్న లెటర్ గురించి ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు?’’ అని నిలదీశారు.
పైగా ఎవరికీ లేని అవకాశం సీబీఐ సునీతకి ఇచ్చిందని అవినాష్ అన్నారు. ‘‘28 జూలై 2020లో సీబీఐ సునీత ఆ లేఖ గురించి అడిగారు. ఈ లేఖ చాలా కీలకమైన ఆధారం, ఆ లేఖ గురించి తెలిస్తే ఇది హత్య అని తెలిసి ఉండేది, అంత ప్రాముఖ్యత ఉన్న లెటర్ ను ఎందుకు దాచిపెట్టమన్నారని ప్రశ్నించింది? దానికి ఆమె మాకు లెటర్ ఉన్న విషయం పీఏ కృష్ణారెడ్డి వాట్సప్ లో చెప్పాడని అంగీకరించింది. అదే టైంలో ఎందుకు బయట పెట్టలేదనడానికి ఊరంతా గొడవలు అవుతాయని చెప్పలేదంటూ పెద్ద థియరీ చెప్పారు. ఆ తర్వాత నెల రోజులకు 27 ఆగస్ట్ 2020 నాడు సీబీఐ ముందుకు వచ్చి నెల రోజుల క్రితం లెటర్ గురించి తాను చెప్పినదంతా తూచ్.. నాకు ఆ లేఖ గురించి ఏం తెలియదు, నేను ఏ లెటరూ చూడలేదు, సాయంత్రం ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చేతిలో లేఖ చూడ్డం తప్ప నాకేమీ తెలియదు అని నిర్మోహమాటంగా అబద్దం చెప్పింది. ముందు ఒక వాంగ్మూలం ఇచ్చిన తర్వాత దాన్ని కవర్ చేయడానికి సీబీఐ మరో వాంగ్మూలం తీసుకోవడం ఎంత వరకు సమంజసం?’’ అని అవినాష్ అడిగారు.
ఎప్పుడు విచారణ జరిగినా.. దేవుడి ముందు, చట్టం ముందు తాము తప్పు చేయలేదన్న విషయాన్ని నిరూపించుకుంటామన్న దైర్యం, నమ్మకం తమకుందని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘విచారణ జరిగేలా సహకరించమని సునీతని కోరుతున్నాం. కానీ వీరి ఆలోచన మాత్రం వచ్చే ఎన్నికల వరకు వివేకానంద రెడ్డి హత్య కేసును లాగడం ద్వారా చంద్రబాబుకి లబ్ది చేకూర్చడమే వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. రాజకీయంగా చంద్రబాబు గారికి ఉపయోగపడాలన్న ఆరాటం తప్ప.. న్యాయం కోసం పోరాటం అన్నది ఎక్కడా లేదు. కాబట్టి చంద్రబాబుకు రాజకీయ లబ్ది చేకూర్చాలన్న ఆలోచనలను పక్కన పెట్టాలని కోరుతున్నాను.