లోకంలో వెల కట్టలేనిది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. అది మనుషులైనా.. జంతువులైనా సరే కడుపున పుట్టిన బిడ్డల కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయదు తల్లి. చిన్న నలుసుగా కడుపులో పడ్డ సమయం నుంచి భూమి మీదకు వచ్చే వరకు ఎంతగానో శ్రమిస్తుంది. బిడ్డ పుట్టిన తరువాత కంటికి రెప్పలా కాచుకుంటుంది. అందుకే తల్లి ప్రేమను మించిన ప్రేమ వేరొకటి ఉండదు. పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ.. అనుదినం కాపాడే తొలి రక్షకుడు తల్లే కదా. అందుకే మాతృప్రేమ కంటే గొప్పదేది విశ్వంలో లేదు. అయితే అటువంటి తల్లి ప్రేమ మనుషులతో పాటు జంతువులలో కూడా అదేవిధంగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాంటి ఓ జంతువులోని తల్లి ప్రేమ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓ కుక్క తన పిల్లలను కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నం చూసిన స్థానికులు దానిలోని తల్లి ప్రేమకు సలాం కొడుతున్నారు. ప్రస్తుతం మిచౌంగ్ తుఫాను ప్రభావంతో గత మూడు రోజులుగా ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అవసరం ఉంటేనే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని అధికారుల సైతం ప్రజలకు సూచించారంటేనే తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఓ కుక్క తన పిల్లలను తుఫాను ప్రభావం బారిన పడకుండా కాపాడుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన కుకునూరు మండలంలో రెండు రోజులుగా తుఫాను ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలుల ధాటికి మనుషులు సైతం బయటకు రావాలంటేనే భయపడుతూ బిక్కుబిక్కుమంటూ వణికిపోయారు. ఈ క్రమంలోనే కుక్కునూరు మండలం దాచారం గ్రామంలో ఓ వీధి కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. ఓ పక్క ఈదురు గాలులు.. మరోపక్క భారీ వర్షాల నేపథ్యంలో అప్పుడే పుట్టిన కుక్క పిల్లలు చలికి తాళలేక వణికిపోయాయి. వాటి బాధను చూసిన తల్లి కుక్క వాటికి ఏ విధంగానైనా చలిగాలులు, భారీ వర్షం నుంచి కాపాడాలనుకుంది. తన రెండు కాళ్లతో ఓ పెద్ద గొయ్యి తీసి.. అందులో పిల్లల్ని దాచింది. ఆహారం కోసం తను బయటికి వెళ్లిన సమయంలో పిల్లలు బయటికి వెళ్లి ప్రమాదంలో పడతాయేమోననే ఆలోచనతో అవి బయటకు రాకుండా ఆ ద్వారాన్ని మట్టితో కప్పేసింది. అంతేకాక ఎవరూ అటువైపు రాకుండా వాటికి రక్షణగా ఆ గొయ్యిపైన పడుకుంది. అలాగే గోతిలో ఉన్న పిల్లలు క్షేమంగా ఉన్నాయో లేదో అనే అనుమానంతో గంటకొకసారి గొయ్యి ద్వారాన్ని త్రవ్వి చూస్తూ వాటికి ఏ ప్రమాదం కలగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది. అది గమనించిన స్థానికులు తన పిల్లల పట్ల ఆ తల్లి కుక్క చూపించిన ప్రేమకు సలాం కొడుతున్నారు. కాగా, ఈ ఘటనతో మనుషులలోనైనా.. జంతువులలోనైనా తల్లి ప్రేమకు ఏది సాటి రాదని మరొకసారి రుజువైంది.