Guntur District: ఈ క్రైమ్ కహాని పక్కాగా మీరు తెలుసుకోవాల్సిందే. గుంటూరు జిల్లా దుర్గి మండలానికి చెందిన కస్తూరి శ్రీనివాసరావు, సాంబశివరావు కొద్దీ మొత్తంలో బంగారం కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. చెన్నై నుండి బంగారం కొనుగోలు చేసి తీసుకురావటానికి స్థానికులకు కమీషన్ ఇచ్చి పంపుతుంటారు. స్థానికులు ఇక్కడ నుండి డబ్బులు తీసుకెళ్ళి చెన్నై లో బంగారు కొని తీసుకొచ్చి దుర్గి వ్యాపారులకు అందిస్తుంటారు. అదే విధంగా ఈ నెల 8వ తేదిన 89 లక్షల రూపాయలను స్థానికులైన ప్రకాశ రావు, అజయ్ కుమార్, రామ శేషయ్య లో కిచ్చిన చెన్నై వెళ్ళి బంగారం తీసుకు రావాలని చెప్పారు. డబ్బులను బ్యాగులో సర్థుకున్న ముగ్గురు సాయంత్రం ఆరు గంటల సమయంలో నడికుడి రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. చెన్నై వెళ్ళే రైలు కోసం రెండో నెంబర్ ప్లాట్ ఫాంపై ముగ్గురు వేచి చూస్తున్న సమయంలో ఐదుగురు వ్యక్తులు తెల్ల కారులో దిగారు. రైలు కోసం వేచి చూస్తున్న ముగ్గురి వద్దకు వచ్చి తాము పోలీసులమని ఎస్సై గారు రమ్మంటున్నారని వారికి చెప్పారు. అయితే ఆ ముగ్గురు తామెందుకు రావాలని ప్రశ్నించడంతో ఐదుగురు వారిపై దాడి చేసి వారి వద్ద నున్న బ్యాగ్ తీసుకొని వచ్చిన కారులోనే పారిపోయారు.
ఒక్కసారిగా అవాక్కైన ఆ ముగ్గురు రైల్వే జిఆర్పిఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 89 లక్షలు చోరి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు చాలెంజింగ్ తీసుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నడికుడి రైల్వేస్టేషన్ లో సిసి కెమెరాలు పనిచేయకుపోటంతో నిందితులను పట్టుకోవటం కష్టంగా మారింది. అయితే గ్రామానికి చెందిన అవారా గాళ్ళు, పాత నేరస్థులుపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే రమేష్ అనే వ్యక్తి గతంలో రెండుసార్లు కమీషన్ కోసం బంగారం తీసుకురావడానికి చెన్నై వెళ్ళినట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని కేసును చేధించారు. దొంగిలించిన బ్యాగ్ ను అడిగొప్పల వద్ద గుంత తీసి గుంతలో దాచిపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన కేసులో పోలీసులు వెంటనే నిందితులను పట్టుకొని మొత్తం నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ సిబ్బందిని రైల్వే ఎస్పీ అనిల్ బాబు అభినందించారు.
రిపోర్టర్:టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు
Also Read: Andhra Pradesh: సేద తీరేందుకు చెట్టు కిందకు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వెన్నులో వణుకు