Montha Cyclone: భయపెడుతున్న మొంథా.. ఏపీ-తెలంగాణకు రెడ్ అలెర్ట్.. స్కూళ్లకు సెలవులు..

బంగాళాఖాతంలో మొంథా తుఫాన్ తీవ్రమవుతోంది. ఇది మంగళవారం రాత్రికి కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, కృష్ణా, నెల్లూరు సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Montha Cyclone: భయపెడుతున్న మొంథా.. ఏపీ-తెలంగాణకు రెడ్ అలెర్ట్.. స్కూళ్లకు సెలవులు..
Montha Cyclone Updates

Updated on: Oct 27, 2025 | 12:38 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇది ప్రస్తుతం నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. గడచిన మూడు గంటల్లో గంటకు 13-18 కి.మీ. వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతానికి తుపాను చెన్నైకి 600-640 కి.మీ., విశాఖపట్నంకి 710-740 కి.మీ., కాకినాడకి 680-710 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఇవాళ ఉదయానికి తుపానుగా బలపడి.. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. మొంథా తుపాను మంగళవారం రాత్రికి కాకినాడ సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవాళ ఈ జిల్లాల్లో

సోమవారం కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీకి అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.

తెలంగాణలోని ఈ జిల్లాల్లో

తెలంగాణలోనూ మొంథా తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలపై ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదవుతాయని.. దీనికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ప్రభుత్వం అలర్ట్

తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు కోరారు. కాకినాడ జిల్లాలో మొంథా తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, అక్కడ పలు పాఠశాలలకు వరుసగా 5 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇతర జిల్లాలైన కృష్ణా, బాపట్ల, తూర్పుగోదావరి, ఏలూరు, పల్నాడు, అన్నమయ్య, కడప జిల్లాల్లోనూ ఒకటి నుంచి మూడు రోజుల వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల ఫిర్యాదులు, అత్యవసర పరిస్థితులకు తక్షణమే స్పందించేలా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి