
ఏపీలో జరుగుతోన్న ఒక టీచర్, రెండు గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలకు ఈనెల 27న పోలింగ్ జరగనుంది. మొత్తం మూడు స్థానాల్లో కలిపి సుమారు 7లక్షల మంది ఓటర్లు.. ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మార్చి మూడున కౌంటింగ్ జరగనుంది. ఉత్తరాంధ్ర టీచర్స్ స్థానంలో మొత్తం 10మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇక్కడ కేవలం టీచర్స్ యూనియన్స్ మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తోంది. ఈ స్థానంలో 22వేల 493మంది టీచర్లు.. ఓటర్లుగా ఉన్నారు.
ఉత్తరాంధ్ర టీచర్స్ స్థానంలో పీడీఎఫ్ నుంచి కోరెడ్ల విజయగౌరి, ఏపీటీఎఫ్ నుంచి పాకలపాటి రఘువర్మ, పీఆర్టీయూ నుంచి గాదె శ్రీనివాసులునాయుడు పోటీపడుతున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 34మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇక్కడ టీడీపీ, పీడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ నడుస్తోంది. టీడీపీ నుంచి పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేస్తుండగా.. పీడీఎఫ్ నుంచి డీవీ రాఘవులు తలపడుతున్నారు. ఇక్కడ, 3లక్షల 14వేల 984మంది గ్రాడ్యుయేట్స్.. ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానంలో 30మంది తలపడుతున్నారు. ఇక్కడ కూడా టీడీపీ, పీడీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉంది. తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా బరిలో నిలవగా.. పీడీఎఫ్ నుంచి కేఎస్ లక్ష్మణరావు తలపడుతున్నారు. ఇక, ఈ స్థానంలో 3లక్షల 46వేల 529మంది గ్రాడ్యుయేట్లు.. ఓటర్లుగా ఉన్నారు.
మరో వైపు తెలంగాణలో కూడా జరుగుతోన్న రెండు టీచర్స్ MLC, ఒక గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలకు ఈనెల 27న పోలింగ్ జరగనుంది. మొత్తం మూడు స్థానాల్లో కలిపి నాలుగు లక్షలకు పైగా గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మార్చి మూడున కౌంటింగ్ జరగనుంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ నడుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి వి.నరేందర్‌రెడ్డి పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి అంజిరెడ్డి బరిలో నిలిచారు.
కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం 56మంది పోటీపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తున్నా.. ఇండిపెండెంట్స్ కూడా గట్టి సవాల్ విసురుతున్నారు. 42 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరుగుతోన్న ఈ ఎమ్మెల్సీ స్థానంలో 3లక్షల 55వేల 159మంది గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక కరీంనగర్ టీచర్స్ స్థానంలో బీజేపీ నుంచి మల్క కొమురయ్య పోటీపడుతుండగా బీఎస్పీ నుంచి యాటకారి సాయన్న గట్టి పోటీనిస్తున్నారు.
కరీంనగర్ టీచర్స్ స్థానంలో 15మంది మాత్రమే పోటీలో ఉన్నారు. ఇక్కడ బీజేపీతోనే మిగతా 14మంది పోటీపడుతున్నారు. బీజేపీకి మెయిన్‌గా బీఎస్పీ, ఇండిపెండెంట్స్ నుంచి పోటీ ఎదురవుతోంది. 42 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరుగుతోన్న ఈ ఎమ్మెల్సీ స్థానంలో 28వేల 88మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నల్గొండ టీచర్స్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో పోటీపడుతున్నారు బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి. నల్గొండ టీచర్స్ స్థానంలో 19మంది పోటీపడుతున్నారు. ఇక్కడ ఐదుగురి మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది.