శ్రీకాకుళం ఎమ్మెల్యే గొoడు శంకర్ కర్ర సాముతో ఇరగదీశారు. తన చిన్నప్పుడు నేర్చుకున్న కర్ర సామును ప్రదర్శించి అందరి చేత ఔర అనిపించుకున్నారు. శ్రీకాకుళంలోని 7 రోడ్ల జంక్షన్ సమీపంలో NTR మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ వద్ద బూర శ్రీరాములు తాళింఖాన్ వందేళ్ల వేడుకలు ఘనం జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కర్ర సాము పోటీలలో ఎమ్మెల్యే శంకర్ ఈ ప్రదర్శన చేశారు. కాసేపు తాను ఎమ్మెల్యే అన్న విషయం, తన హోదాను, గన్ మెన్లను పక్కన పెట్టి కర్ర సాముతో సందడి చేసారు.
మరుగున పడిపోతున్న ప్రాచీన గ్రామీణ విద్య కర్ర సాము. అటువంటి కర్ర సాముకు ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంతో కర్రసాము పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కర్రసాము పోటీలలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని, తన టాలెంట్‌ను చూపించారు. సాధారణంగా ప్రజాప్రతినిధులకు నిత్యం గన్‌మెన్ లు రక్షణగా ఉంటారు. కానీ ఎంతటి వారికైనా సెల్ఫ్ ప్రోటెక్షన్ చాలా కీలకమని ఎమ్మెల్యే తన కర్ర సాము ప్రదర్శన ద్వారా చెప్పకనే చెప్పారు..!