ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయానికి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోతున్న సమయంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్‌గా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని అందరు భావిస్తున్నారు. అయితే 2014 ఏప్రిల్ 1 నాటికి మిగిలి ఉన్న ఈ ప్రాజెక్టు సాగునీటి విభాగానికి సంబంధించిన 100 శాతం నిధులను కేంద్రమే సమకూర్చుతుందని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతోందని నివేదికలో వెల్లడించింది.
ఇందుకు సంబంధించి కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ నిధుల వివరాలను తెలియజేసింది. 2017-18 ధరల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి రూ. 55వేల 548.87 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదముద్ర వేసింది. 2020 ఏడాది పురోగతి నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. 2454 మీటర్ల ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం, 1128.4 మీటర్ల పొడవైన స్పిల్‌వేతో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉభయ గోదావరి జిల్లాలు విశాఖ, కృష్ణాజిల్లాల్లో 2.91 లక్షల హెక్టార్లకు సాగునీటితో పాటు ఇతర ప్రయోజనాలు కల్పించాలన్నది లక్ష్యమని మంత్రిత్వ శాఖ నివేదికలో తెలిపింది. 2017-18 నాటి ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు ఆమోదిత వ్యయం రూ. 55వేల 548.87 కోట్లు కాగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 8614.16 కోట్లకు పెరిగింది. అందులో రూ.1850 కోట్ల రూపాయలు ఈ ఏడాది జనవరి నుంచి విడుదల అయ్యాయని, దీనికి తోడు 2020-21 ఏడాదిలో రూ.2234 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపింది.