Amalapuram: “దోషులను కఠినంగా శిక్షిస్తాం.. సంయమనం పాటించండి”.. మంత్రి వేణుగోపాలకృష్ణ కామెంట్స్

హింసాత్మక చర్యలతో లబ్ధి పొందాలని కొంతమంది చేస్తున్న కుట్రలో ప్రజలు చిక్కుకోవద్దని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంత్రి విశ్వరూప్(Minister Vishwaroop), ఎమ్మెల్యే పొన్నాడ...

Amalapuram: దోషులను కఠినంగా శిక్షిస్తాం.. సంయమనం పాటించండి.. మంత్రి వేణుగోపాలకృష్ణ కామెంట్స్
Chelluboina

Updated on: May 25, 2022 | 4:00 PM

హింసాత్మక చర్యలతో లబ్ధి పొందాలని కొంతమంది చేస్తున్న కుట్రలో ప్రజలు చిక్కుకోవద్దని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంత్రి విశ్వరూప్(Minister Vishwaroop), ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఇంటిని తగలబెట్టడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. అమలాపురం వాసులు శాంతం వహించాలని కోరారు. జరిగిన దహన కాండ సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తోందని మండిపడ్డారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన దోషులు ఎంతటివారైనా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని హెచ్చరించారు. అమాయక యువకులు అరాచక శక్తుల ప్రలోభాలకు గురికాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని మంత్రి కోరారు. పోలీస్ రెవెన్యూ శాఖలు ప్రశాంతతను నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాయని.. వీరికి పౌరులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతతకు మారుపేరు అయిన కోనసీమలో అశాంతికి కారణమైన వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసనకారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురికి గాయాలయ్యాయి. సెక్షన్‌ 144, 30 పోలీస్‌ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి