
ఎన్నికల సమయంలో రాజకీయపార్టీల నాయకుల చేష్టలు కొన్నిసార్లు వింతగా, ఆసక్తికరoగా ఉంటాయి. ప్రజలలో మమేకం అయ్యేందుకు వారు ఏ అవకాశాన్నీ వదులుకోరు. కొంతమంది కూలీగా అవతారం ఎత్తుతారు. మరి కొంతమంది రాజకీయ నాయకులు దోబీ దగ్గరకెళ్ళి బట్టలు ఇస్త్రీ చేస్తూ దోబిలా మారతారు.ఇలా ఎన్నికల సమయంలో రాజకీయనాయకులు దశావతారాలు ఎత్తుతూ ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళ మంత్రి సీదిరి అప్పలరాజు తనలోని మరో యాంగిల్‌ను బయటపెట్టారు. ఫైర్ బ్రాండ్‌గా, మంత్రిగా అందరికీ సుపరిచితులైన ఆయన తనలోని సింగర్‌ను బయటకు తీసారు.
తన సొంత నియోజకవర్గమైన పలాసలోని మందస మండలం రట్టి గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ వల్లభనారాయణస్వామి వారి జాతర మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సీదిరి అప్పలరాజు సాయంత్రం కాసేపు అలా భక్తి పారవశ్యంలో మునిగితేలారు. జాతరలో స్టేజ్‌పై భజనలు, భక్తి గీతాలాపనలు జరుగుతుండగా వేదికపైకి వెళ్లి మంత్రి సైతం వారితోపాటు గొంతు కలిపారు. కాసేపు భక్తి పాటలు పాడుతూ అందరినీ అలరించారు. గతంలోనూ పలు సందర్భాలలో మంత్రి అప్పలరాజు భక్తి పాటలు పాడటంతో పాటు ఈ ఏడాది తన నివాసం వద్ద జరిగిన వినాయక నిమజ్జనోత్సవాలలో కుటుంబ సభ్యులతో కలిసి డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మంత్రి భక్తి గీతాలాపనలు విన్న స్థానికులు ఎన్నికలు ముగిసేలోగా ఇంకా ఎన్ని అవతారాలు ఎత్తుతారో చూడాలిమరి అంటూ గుసగుసలాడుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..