TDP MLA Granite Quarries: ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ ఫ్యాక్టరీల్లో మైనింగ్ అధికారులు గత మూడు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. గుంటూరు , ప్రకాశం జిల్లాలో గొట్టిపాటికి కిషోర్ స్లాబ్ అండ్ టైల్స్, కిషోర్ స్టోన్స్ పేరుతో క్వారీలు ఉన్నాయి. వీటిలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జొన్నతాళిలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలో పనులు నిలిపివేయించి మరీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఇప్పటికే రవి కుమార్‌కు చెందిన క్వారీలు మూసివేయించారు అధికారులు. తాజాగా గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీల్లో కూడా తనిఖీలు చేస్తూ ఫ్యాక్టరీలను మూసివేయించడంతో 500 మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఫ్యాక్టరీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రాజకీయ నేతలకు చెందిన క్వారీలు, ఫ్యాక్టరీల జోలికి వెళ్ళని అధికారులు టిడిపికి చెందిన ఎమ్మెల్యే రవికుమార్ ఫ్యాక్టరీల్లోనే తనిఖీలు చేయడం వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. గొట్టిపాటి ఫ్యాక్టరీ మూసివేతే లక్ష్యంగా ఏపీ సర్కారు పావులు కదుపుతోందని ఆరోపిస్తున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆయనకు చెందిన గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ ఫ్యాక్టరీల్లో మైనింగ్ అధికారులు తనిఖీలు చేపట్టడం చర్చనీయాశంగా మారింది. పంచాయతీ ఎన్నికల వేళ ఎమ్మెల్యే క్వారీల్లో తనిఖీలు జరగడంలో రాజకీయ కోణం ఉన్నదనే టాక్ వినిపిస్తోంది.