ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో భానుడు భగభగమండుతున్నాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచే సెగలు కక్కుతున్నాడు. రాత్రయినా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపించడం లేదు. నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడుతుందని భావించినప్పటికీ ఎండ తీవ్రత ఏ మాత్రం తగ్గటం లేదు. రాబోయే 3 రోజులు ఏపీలో(High Temperatures in AP) అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఉష్ణగాలుల ప్రభావం పెరుగుతుందని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. రాగల మూడు రోజుల్లో 46-47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 46- 47 డిగ్రీలు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43-45 డిగ్రీలు, విశాఖపట్నం, కడప, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 40 -42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.
కాగా గడిచిన 24 గంటల్లో అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా అన్ని ప్రాంతాల్లో 40-45 డిగ్రీలు ఉంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డీ హైడ్రేషన్‌కు గురికాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి