
బుధవారం ఉదయం మారేడిమిల్లి సమీపంలో భద్రతా దళాలకు,మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ తో శ్రీకాకుళం జిల్లా ఉలిక్కిపడింది. ఎన్కౌంటర్ లో మృతి చెందిన ఏడుగురు మావోయిస్టులలో ఒకరైన మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ CCM గా జోగారావు పనిచేస్తున్నాడు. మెట్టూరి కామయ్య, చిన పిల్లమ్మ దంపతుల సంతానమైన జోగారావు పడవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆరోజుల్లోనే విప్లవ ఉద్యమాల వైపు ఆకర్షితుడై ఉద్ధానం దళం లో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు.
వయో వృద్ధులైన జోగారావు తల్లిదండ్రులు కాలం చేయగా ముగ్గురు సోదరులు, ఇద్దరు అక్క, చెల్లెళ్ళు ఉన్నారు. జోగారావు మరణావార్త విని బాతుపురం లోని మృతుడి సోదరి శేషమ్మ ఇంటి వద్దకు మాజీ మావోయిస్టులు పోతన పల్లి అరుణ @ అరుణక్క, ఇరోతు ఈశ్వరరావు, ప్రజా, విప్లవ సంఘాల నాయకులు, సానుభూతి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
మారేడు మిల్లులో జరిగింది భూటకపు ఎన్కౌంటర్ అని నిరాయుధులుగా ఉన్న వారిని పట్టుకొని కాల్చి చంపారని మావోయిస్టు సానుభూతిపరులు ఆరోపిస్తున్నారు. బడా బాబులకు అటవీ సంపదను కట్టబెట్టడానికే ఆపరేషన్ కగార్ ను కేంద్రం చేపట్టిందని మండిపడ్డారు.మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలని కోరుతున్నారు. జోగారావు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.