Andhra: తెలిసిన వ్యక్తి ఇంటికి సంచితో వచ్చి మందు సిట్టింగ్ వేశాడు.. నైట్ అతను నిద్ర పోతున్నప్పుడు

ఏడు వేల రూపాయల అప్పు… ఒక నిండుప్రాణాన్ని బలితీసుకుంది. టంగుటూరులో జరిగిన ఈ దారుణ హత్యలో స్నేహమే శత్రువైంది. చిన్న అప్పుపై పెరిగిన కక్ష చివరకు కత్తిపోట్లకు దారి తీసింది. ఎలాంటి క్లూ లేకపోయినా, సాంకేతిక పరిజ్ఞానంతో నాలుగు రోజుల్లోనే హంతుకుడ్ని పట్టుకున్నారు పోలీసులు. డబ్బు కోసం మనిషి ఎంత దారుణంగా మారతాడో చెప్పే హృదయవిదారక ఘటన ఇది.

Andhra: తెలిసిన వ్యక్తి ఇంటికి సంచితో వచ్చి మందు సిట్టింగ్ వేశాడు.. నైట్ అతను నిద్ర పోతున్నప్పుడు
Ramanaiah- Edukondalu

Edited By:

Updated on: Dec 23, 2025 | 3:50 PM

ఏడు వేల రూపాయల అప్పు కోసం స్నేహితుడ్ని దారుణంగా చంపేశాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తనకు ఇవ్వాల్సిన 7వేల నగదు ఇవ్వలేదన్న కోపంతో కత్తులతో పొడిచి పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతుడి వేలికున్న బంగారు ఉంగరాన్ని తీసుకుని పరారయ్యాడు. ప్రకాశం జిల్లా టంగుటూరులో జరిగిన ఈ దారుణ హత్య ఘటన కలకలం రేపింది. ఒంటరిగా ఉంటున్న వ్యక్తిని ఎవరు హత్య చేసి ఉంటారో తెలియక పోలీసులు తొలుత సతమతమయ్యారు. ఒక చిన్న క్లూ కూడా లభించలేదు. ఈ హత్య కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో జరిపిన విచారణలో స్నేహితుడే హంతుకుడిగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. కేవలం 7 వేల రూపాయల అప్పుకోసం నిండుప్రాణాన్ని బలితీసుకున్నట్టు తేల్చారు.

ప్రకాశం జిల్లా టంగుటూరులోని పాతవడ్డెపాలెంలో ఈనెల 16వ తేదీ రాత్రి జరిగిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సెక్యూరిటీ గార్డు వెంకటరమణయ్య హత్యకేసును నాలుగురోజుల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. ప్రకాశంజిల్లా ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఐ హజరత్తయ్య, ఎస్సైలు బృందంగా ఏర్పడి నిందితుడ్ని పట్టుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసును సాల్వ్‌ చేశారు. ప్రకాశంజిల్లా మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామానికి చెందిన 55 ఏళ్ళ యనమలమంద వెంకటరమణయ్య గత 25 ఏళ్ల క్రితం స్వగ్రామం నుంచి వచ్చి టంగుటూరు మండలం రావివారిపాలెం వలస వచ్చి నివాసం ఉంటున్నాడు. ఆ తరువాత సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో పలు కంపెనీల్లో ఉద్యోగం చేశాడు… అనంతరం రెండేళ్ల క్రితం టంగుటూరులోని బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా చేరాడు…

కలకలం రేపిన రమణయ్య హత్య…

వెంకటరమణయ్యకు భార్య, పిల్లలు ఉన్నారు. భార్య ఆరేళ్ల క్రితం చనిపోయింది. కొడుకు హైదరాబాద్‌లో ఉద్యోగరీత్యా అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో టంగుటూరులోని పాతవడ్డిపాలెంలో ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు వెంకటరమణయ్య. కొడుకు అప్పుడప్పుడూ ఫోన్‌ చేసి క్షేమసమాచారాలు తెలుసుకుంటుంటాడు. ఈ నేపధ్యంలో ఈనెల 17వ రాత్రి వెంకటరమణయ్యకు కొడుకు ఫోన్‌ చేశాడు… ఫోన్‌ మోగుతోంది కానీ లిఫ్ట్‌ చేయడం లేదు… మళ్లీ 18వ తేది ఉదయం ఉంచి వరుసగా ఫోన్‌ చేస్తున్నా తండ్రి లిఫ్ట్‌ చేయకపోవడంతో అనుమానం వచ్చి గ్రామంలోని తన స్నేహితులకు ఫోన్‌ చేసి ఒకసారి చూసిరమ్మని పంపించాడు. తీరా వచ్చి చూస్తే వెంకటరమణయ్య రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు… పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు… వెంకటరమణ తల, గొంతుపై కత్తి గాయాలను గుర్తించారు. ఈనెల 16వ తేది రాత్రి హత్య జరిగినట్టు నిర్ధారించుకున్నారు… హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఒంగోలు డిఎస్‌పి రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు.

నాలుగురోజుల్లోనే మర్డర్‌ మిస్టరీ ఛేధించిన పోలీసులు…

టంగుటూరులో జరిగిన వెంకటరమణయ్య హత్య కేసును నాలుగు రోజుల్లోనే పోలీసులు చేధించి నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. తొలుత ఈ హత్య కేసులో చిన్న క్లూ కూడా లభించకపోవడంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు. ఈ ప్రత్యేక దర్యాప్తులో వెంకట రమణయ్యను హత్య చేసింది అతని స్నేహితుడు ఏడుకొండలుగా గుర్తించారు. ఇద్దరి మధ్య 7 వేల రూపాయల అప్పు హత్యకు దారి తీసిందని గుర్తించారు. ఒంగోలు డిఎస్‌పి రాయపాటి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం… సింగరాయకొండలో వెంకట రమణయ్య ఓ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన తాత ఏడుకొండలు పరిచమయ్యాడు. అప్పటి నుంచి ఇరువురూ కలిసి అప్పుడప్పుడూ మద్యం సేవిస్తూ ఉండేవారు. ఇద్దరి మధ్య ఉన్న స్నేహంతో వెంకట రమణయ్య, ఏడుకొండలు నుంచి 7 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ తరువాత తన అప్పును తిరిగి ఇవ్వాలని ఏడుకొండలు ఎన్నిసార్లు కోరినా రమణయ్య ఖాతరు చేయలేదు. దీంతో రమణయ్యపై కక్ష పెంచుకున్న ఏడుకొండలు స్నేహితుడ్ని చంపేసి అతని చేతి వేలికి ఉన్న బంగారు ఉంగరాన్ని తన బాకీ కింద జమవేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్‌ ప్రకారం ఈనెల 16వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో ఏడుకొండలు వెంకటరమణయ్య ఇంటికి వచ్చాడు. అతడిని హత్యచేయడానికి సంచిలో గొడ్డలి, కత్తి ముందుగానే తెచ్చుకున్నాడు. రమణయ్యతో ఎప్పటిలాగే స్నేహం నటిస్తూ మద్యం సేవించారు. అర్థరాత్రి 12.30 గంటల సమయంలో వెంకట రమణయ్య నిద్రిస్తున్న సమయంలో తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో విచక్షణారహితంగా తలపై కొట్టి చంపేశాడు… అనంతరం రమణయ్య చేతివేలికి ఉన్న బంగారు ఉంగరాన్ని తీసుకుని పరారయ్యడు… అయితే ఇంట్లో రమణయ్య ఇంట్లో ఒంటరిగా ఉండటంతో ఈ హత్య రెండు రోజుల తరువాత 18వ తేది ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సింగరాయకొండ సీఐ హజరత్తయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టవర్‌డంప్‌, క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ సహకారంతో ఏడుకొండలను నిందితుడిగా గుర్తించారు. వావిలేటిపాడు జాతీయ రహదారిపై నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతి తక్కువు రోజుల్లో చాకచక్యంగా హత్యకేసును ఛేదించిన సీఐ చావా హజరత్తయ్య, ఎస్సైలు నాగమల్లేశ్వరరావు, బత్తుల మహేంద్రలను ఒంగోలు డిఎస్‌పి రాయపాటి శ్రీనివాసరావు అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.