లంపీ స్కిన్ వ్యాధి శ్రీ సత్య సాయి జిల్లా రైతాంగాణ్ని వణికిస్తోంది. ఇక్కడి పశువులు లంపీ స్కిన్ వైరస్ బారిన పడుతున్నాయి. పుట్టపర్తి నియోజకవర్గం లో పశువులను ఈ వైరస్ వణికిస్తోంది. జిల్లాలో లంపి వైరస్ సోకుతున్న పశువుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ బారిన పడిన అనేక ఆవులు చర్మం చర్మం చిన్న చిన్న ముద్దలా తయారవుతోంది. పక్క రాష్ట్రం, పక్క జిల్లాల నుంచి వచ్చిన ఈ వైరస్ తమ పశువులకూ సోకడంతో పాడి రైతులు బెంబేలెత్తుతున్నారు.
ఈగల కారణంగా వైరస్ పశువులకు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వైరస్ సోకేముందు రెండు నుంచి మూడు రోజుల పాటు పశువుకు జ్వరం వస్తుంది అనంతరం శరీరం అంతటా 2-5 సెంటీమీటర్ల పరిమాణంలో చర్మంపై పొక్కులు, దద్దుర్లు, బొబ్బలు కనిపిస్తాయి. ఇవి పుండ్లుగా మారి శరీరమంతా వ్యాపిస్తాయి. దీంతో తీవ్ర జ్వరం వచ్చి.. పశువులు పాలు ఇవ్వడం, గడ్డి తినడం మానేస్తాయి. లంపీస్కిన్ డిసీజ్‌ను ముందు పాకిస్తాన్‌లో గుర్తించారు. అక్కడి నుంచి భారత్ సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్‌లకు విస్తరించి.. క్రమంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లో కూడా అడుగు పెట్టింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా, శ్రీకాకుళం జిలాల్లో అనేక పశువులకు లంపి వైరస్ సోకిన సంగతి తెలిసిందే.
ఈ లంపీ స్కిన్ వైరస్ మనుషులకి సోకే అవకాశం లేదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంతేకాదు ఈ వ్యాధి సోకిన ఆవు పాలు తాగవచ్చునని.. ఎటువంటి ముప్పు లేదని వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..