ఎంపీ రఘురామ కుటుంబసభ్యుల ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. వారి ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపారు. రఘురామ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం.. హోంశాఖను కోరింది. ఈ మేరకు రఘురామ కుటుంబీకుల ఫిర్యాదు కాపీని హోంశాఖకు పంపారు.
ఇటీవల రఘురామ కుటుంబ సభ్యులు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రఘరామ భార్య రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందు ప్రియదర్శిని స్పీకర్ తో భేటీ అయ్యారు. ఎంపీ రఘురామను జగన్ సర్కార్ వేధిస్తుందని వారు కంప్లైంట్ చేశారు. రాజద్రోహం కింద అక్రమ అరెస్టులు చేసి.. వేధింపులకు పాల్పడుతుందని ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను సైతం కలిసి ఇదే విషయాన్ని తెలిపారు. రఘురామ ప్రాణానికి ముప్పు ఉందని.. జగన్ ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ క్రమంలో వారి ఫిర్యాదుపై తాజాగా లోక్ సభ స్పీకర్ స్పందించారు.
మరోవైపు, రఘురామరాజు తనయుడు భరత్ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీలో తన తండ్రి మీద దాడిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. సీబీఐ లేదా ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలన్న భరత్.. ప్రతివాదులుగా సీఎం జగన్, సీబీసీఈఐడీ అధికారులను చేర్చారు. దర్యాప్తులో దోషులుగా తేలిన వారిపై కేసులు నమోదు చేసేలా ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గర్బిణి కోసం ప్రత్యేక వైద్య సహాయ కేంద్రం.. హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు