Andhra Pradesh: లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. మరో రెండేళ్లు వేచిచూడాల్సిందేనా..?

గ్రామస్థాయిలో ప్రజలకు దగ్గరగా పనిచేసే లోకల్ బాడీ ఎన్నికలు ఈసారి వాయిదా పడేలా కనిపిస్తున్నాయి. గ్రామ స్వరాజ్యంలో కీలకంగా ఉండే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్ పదవుల కోసం ఎదురుచూస్తున్న వందలాది ఆశావహులకు ఇది పెద్ద నిరాశగా మారింది. ఈ క్షణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Andhra Pradesh: లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. మరో రెండేళ్లు వేచిచూడాల్సిందేనా..?
Ap Local Body Elections

Edited By:

Updated on: Feb 07, 2026 | 6:09 PM

గ్రామస్థాయిలో ప్రజలకు దగ్గరగా పనిచేసే లోకల్ బాడీ ఎన్నికలు ఈసారి వాయిదా పడేలా కనిపిస్తున్నాయి. గ్రామ స్వరాజ్యంలో కీలకంగా ఉండే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్ పదవుల కోసం ఎదురుచూస్తున్న వందలాది ఆశావహులకు ఇది పెద్ద నిరాశగా మారింది. ఈ క్షణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణన, కులగనన ప్రక్రియలు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఎన్నికలు కనీసం మరో రెండేళ్లు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చిలో మున్సిపాలిటీ పదవీకాలం, ఏప్రిల్ నెలలో పంచాయతీలు, జూన్ నాటికి జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగియనున్నాయి. సాధారణంగా ఈ సమయంలోనే ఎన్నికలు జరగాలి. కానీ ఈ సారీ పరిస్థితి భిన్నంగా ఉంది.

జనాభా, సామాజిక వర్గాల లెక్కల ప్రకారంగా రిజర్వేషన్లు మార్చాల్సి ఉంటుంది. గ్రామాల పునర్విభజన కూడా అవసరం అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కాకుండా ఎన్నికలు నిర్వహించడం సాంకేతికంగా, చట్టపరంగా సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. అందుకే పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించే అవకాశం కనిపిస్తుంది.

ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. విజయవాడ రూరల్, నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో గ్రామ పంచాయతీలు, పదలు సంఖ్యలో మునిసిపాలిటీలు ఉన్నాయి. స్థానిక సంస్థల పదవులను ఇక్కడ గౌరవంగా చూస్తారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కానీ ఇప్పుడు వారి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనుచరులను సమీకరించిన పలువురు నాయకులు ఇప్పుడు ఆగిపోవాల్సి వచ్చింది. అధికార పార్టీ, ప్రతిపక్షాలు రెండు కూడా గ్రామస్థాయిలో బలపడాలని భావించినా.. ఎన్నికలు లేకపోవడంతో రాజకీయ కార్యకలాపాలు నెమ్మదించాయి..

ప్రత్యేకంగా సర్పంచ్ పదవులపై కన్నేసిన యువ నేతలు మరో రెండేళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారిక షెడ్యూల్ లేకపోవడంతో గ్రామాల్లో రాజకీయ చర్చలు మాత్రమే మిగిలిపోయాయి. మొత్తం మీద చూస్తే జనగణన, కులగనన పూర్తయ్యాకే రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. ఆ తర్వాతే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రక్రియకు సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. అందువలన ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు 2027 చివరి లేదా 2028 ప్రారంభంలోనే జరిగే అవకాశం ఉందని అంచనా వేసుకుంటున్నారు. అంతవరకు గ్రామ పాలన ప్రభుత్వ నిర్ణయంపై ప్రత్యేక అధికారుల చేతుల్లోనే ఉండనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.