నిశ్శబ్దం మానవుడికి అసహజం అంటారు. ఎందుకంటే మనిషి ఏడుస్తూనే భూమిపైకి వచ్చాడు. సుఖం, దుఃఖం, కోపం , భయం , ఆవేశం , ఆనందం ఇలా భావావేశాలను వ్యక్తం చేయగలిగేవాడు మనిషి. ఏడుపులో వినిపించే ఆవేదన , నవ్వులో కనిపించే ఆనందం, దుఃఖంలో దాగి ఉండే బాధ వీటన్నింటి వెనుక శబ్దం ఉంది. వాటి మధ్య భేదమే నాదం గా మారితే ఆనాదం ఆరోహణ , అవరోహణ క్రమంలో వుంటే అది రాగమై, స్వరభేధంతో సంగీతంగా మారి మనసులను ఆకట్టుకుంటుంది. ఇపుడు సోషల్ మీడియా పుణ్యమా అని చాటింగ్ మనిషి ని నిశ్శబ్దజీవిగా మార్చి మానసిక వత్తిడి అనే రుగ్మతలా అందరిలోకి ఆవహిస్తుంది. నిశ్శబ్దం ని భరించలేని మనిషి మౌనంగా తోటి వారికి దూరంగా సెల్ ఫోన్ లోనే తన కాలాన్ని బంధించేసుకుంటున్నాడు. ఇది మనిషి సహజ లక్షనానికి భిన్నమైన జీవన శైలి. దీని నుంచి బయటపడాలంటే పోజిటివ్ పనులను అలవాటు చేసుకోవాలి. రోజులో కొంత సేపు సెల్ ఫోన్ చూడకూడదు. చాటింగ్ ఈ సమయంలోనే చేయాలి అనే నియమాలు పెట్టుకుని ఆ దొరికిన సమయాన్ని సంగీతం, ఆటలు , పాటలు ఇతర అంశాలు నేర్చుకోవటం పై దృష్టి పెడితే క్రమక్రమంగా మార్పు సాద్యం అవుతుందంటారు. అయితే ఇపుడంతా డి జె మోతలతో నిండి ఉన్న సంగీతమనుకోకండి. రాళ్ళను సైతం కరిగించే శక్తీ మన భారతీయ సంగీతానికి ఉంది.
శిశుర్వేత్తి, పశుర్వేత్తి వేత్తిగాన రసంఫణిః అంటారు. శిశువులు, పశువులు, పాములు కూడా సంగీతానికి పరవసిస్తాయట. సంగీతమంటే గానం మాత్రమే కాదు వాయిద్యాల మీద కూడా అభ్యసిస్తారు. డోలు, మృదంగం, సన్నాయి, వయోలిన్, ఫ్లూట్, వీణ ఇవన్నీ మన శాస్త్రీయ సంగీత వాయిద్యాలు. వీణలో ఈమని శంకర శాస్త్రి, చిట్టిబాబు, ఘంటశాల వెంకటేశ్వరరావు, వయోలిన్లో ద్వారం వెంకటస్వామి నాయుడు, మృదంగంలో యల్లా వెంకటేశ్వరరావు ఇలా ఎందరో ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. వీణల తయారీలో బొబ్బిలి, విజయనగరం, నూజివీడు ప్రాంతాలు పేరుగాంచాయి. అయితే వీటి తయారి అంతరించిపోతూ కలగా మారిన నేపద్యం దీనిపై ఆధారపడిన అందరిని ఆందోళన కలిగిస్తుంది. వీణల తయారికి పనస కలపను వినియోగిస్తారు. ఒక్కో వీణ దాని ప్రత్యేకత అంటే రూపం , ఆహార్యం ను బట్టి నెలరోజులు సైతం తయారికి పడుతుంది.
నూజివీడు లో ఈ వీణ ల తయారి ప్రపంచ ప్రక్యతి గాంచింది. ఇక్కడ షోకేస్లలో పెట్టుకునే చిన్న చిన్న వీణల నుంచి తయారి జరుగుతుంది. ఎన్నో రికార్డ్లను ఇక్కడ కళాకారులు సాధించారు.
అయితే ఇదంతా గత వైభవం అని చెప్పుకోవటానికి విలు లేదు. వీరి కళాత్మకతను, ప్రభావాన్ని గుర్తించిన ప్రభుత్వం నూజివీడు వీణల తయారీలో శిక్షణ కోసం హ్యాండీ క్రాఫ్ట్ సర్వీస్ సెంటర్ ను నిరవహించబోతుంది. తుక్కులూరు గ్రామంలో వీణల తయారీలో శిక్షణ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ టైల్స్ హ్యాండీ క్రాఫ్ట్ సర్వీస్ సెంటర్ ప్రమోషన్ ఆఫీసర్ రవీంద్ర గౌతమ్ అధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రవీంద్ర గౌతమ్ మాట్లాడుతూ దేశంలో అంతరించిపోతున్న చేతి వృత్తుల్లో ప్రాచీన కళ అయిన వీణల తయారీ ఒకటని, ఈ కళను ప్రోత్సహించేందుకు ఆసక్తి ఉన్న వారికి వీణల తయారీలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీణల తయారీలో నిష్ణాతుడు అయిన షేక్ మాబూ నివాసం వద్ద వీణల తయారీని నేర్చుకోవాలని కొత్తగా ఆసక్తి గల వారు కూడ పాల్గోనవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్ హ్యాండీ క్రాఫ్ట డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి ఐవి లక్ష్మీనాథ్ మాట్లాడుతూ నూజివీడు వీణ అంతరించిపోతున్న కళగా భావించి, భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో వీణల తయారీలో ఐదు నెలలు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వీణల తయారీ నేర్చుకునే వారికి అవసరమైన ముడి సరుకు అందించడంతో పాటు శిక్షణ కాలంలో 7,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వీణల తయారీకి ఆసక్తి గల వారు దరఖాస్తులను ఈనెల 20లోగా మాబు వీణల తయారీ కేంద్రం, నూజివీడు చిరునామాకు పంపాలన్నారు.
లేపాక్షి మేనేజర్ కుమార్ మాట్లాడుతూ హస్త కళలు ప్రోత్సాహానికి మంత్రి ఎస్. సవిత, ప్రిన్సిపల్ సెక్రటరి సునిత కృషి చేస్తున్నారని, ప్రభుత్వం ప్రోత్సాహంతో ఈ ఏడాది 150 రోజులపాటు శిక్షణ అందిస్తున్నామన్నారు.
వీణల తయారీదారుడు షేక్ మాబు మాట్లాడుతూ అంతరించిపోతున్న హస్త కళల్లో వీణ ఒకటని భావించి, రాష్ట్ర ప్రభుత్వం ఈ వీణల తయారీకి ప్రోత్సాహం అందిస్తున్నదన్నారు. ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన వీణను తయారుచేసిన తాను, ఎందరో ప్రముఖులకు వీణలను అందించినట్లు చెప్పారు. టీవీ 9 తెలుగు న్యూస్ చానెల్ లో సైతం గతం లోనే నూజివీడు వీణల తయారీ కార్మికుల వైభవాన్ని, కళాత్మకతను ప్రత్యేక కధనంలో వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కళ అంతరించిపోతున్నదిగా మిగిలిపోకూడదంటే నేటి యువతరానికి ఇందులోని మెళుకువలను అందిపుచ్చుకోవలసిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం తోడ్పాటు, చేయూత అందిస్తున్న ప్రస్తుత తరుణంలో పూర్వవైభవం రాగలదని మనమూ ఆశిద్దాం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..