
నల్లమల అటవీప్రాంతంలో వన్యప్రాణుల వేటగాళ్లు రెచ్చిపోతున్నారు… అడవి పందులు, జింకల కోసం ఉచ్చు బిగుస్తున్నారు… ఈ క్రమంలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కొలుకుల అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కి ఓ చిరుత మృతి చెందడం కలకలం రేపింది. దీంతో నల్లమలలో వేటగాళ్లు మళ్లీ వన్యప్రాణులను యధేచ్చగా వేటాడుతున్నట్టు తేలింది… ఈ ఘటనతో అటవీశాఖ అధికారులు ఖంగుతిన్నారు. వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత చనిపోవడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ సాయంతో వేటగాళ్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు. స్థానికులతో పాటు విలేకరులను కూడా ఘటనా స్థలానికి అనుమతించడం లేదు.
గతంలోనూ పెద్దపులి, చిరుతల మృతి…
గత ఏడాది వెలుగోడు రేంజ్‌లో ఓ పెద్దపులి ఉచ్చులో పడి మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే… అలాగే శ్రీశైలం శిఖరం, హటకేశ్వరం సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఓ పెద్దపులి, రెండు చిరుత పులి పిల్లలు మృత్యువాత పడ్డాయి. గుంటూరు – కర్నూలు నేషనల్ హైవేపై బైర్లూటి చెక్ పోస్ట్ దగ్గర రోడ్డు దాటుతున్న చిరుతను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో చనిపోయింది… గత ఏడాదిలో నల్లమల అటవీప్రాంతంలో పెద్ద పులులు, చిరుత పులులు పదుల సంఖ్యలో మృతి చెంది ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి… ప్రస్తుతం ఎండాకాలం సమీపిస్తుండటంతో నల్లమల అటవీప్రాంతంలో నీటి కుంటలు, సాసర్ పిట్లలో నీరు లేక చిరుతలు జనారణ్యంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మళ్లీ రెచ్చిపోతున్న వేటగాళ్లు… ఉచ్చులను గుర్తించలేని అటవీశాఖ అధికారులు
నల్లమలలో మావోయిస్టుల ఉనికి ఉన్నంత వరకు వన్యప్రాణుల వేటగాళ్లు అసలు అటువైపే వచ్చేవారు కాదు… అయితే ప్రస్తుతం నల్లమలలో మావోయిస్టులు లేకపోవడంతో గత కొన్నేళ్లుగా నల్లమలలో వన్యప్రానుల వేటగాళ్లు రెచ్చిపోతున్నారు… నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రానులను యధేచ్చగా వేటాడుతున్నట్టు అనుమానాలున్నాయి… అడవి పందులు, జింకల కోసం ఉచ్చులను వేస్తూ నీరు ప్రవహించే ప్రాంతాలలో వన్యప్రాణులను వేటాడుతున్నారు… వాటి మాంసంను జోరుగా విక్రయాలు చేస్తున్నారు… మరోవైపు అడవిలో విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులు వేటగాళ్ళ ఉచ్చులను తొలగించడంలో విఫలం చెందినట్టు కనిపిస్తోంది… మరో వైపు వన్యప్రాణులను వేటగాళ్లను నామమాత్రంగా పట్టుకోని కేసులు పెడుతున్నరన్న ఆరోపణలు ఉన్నాయి… నల్లమలలో వేటగాళ్ల కదలికలను కనిపెట్టి వారికి గ్రామాల్లో సహకారం లభించకుండా చేసే విధంగా అటవీశాఖ అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పిచడంలో విఫలమవుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..