
తెలుగు రాష్ట్రాల్లో గతేడాది నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈసారి మాత్రం సీజన్ ఆరంభంలోనే ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. కేరళలోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు తొలకరిజల్లులు పలకరించాయి. పసిఫిక్ మహాసముద్రంలో లానినా, హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్‌గా మారతుండడం నైరుతి రుతుపవనాలకు అనుకూలమని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. దీని ప్రభావంతో దేశంలో అనేక ప్రాంతాల్లో మాంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. భారతదేశ వ్యవసాయ రంగానికి మేలు చేసే నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయంటున్నారు. ఈసారి లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడటం వంటి కారణాలతో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది.
వాస్తవానికి రుతుపవనాల సీజన్ దాదాపుగా 120 రోజులపాటు ఉంటుంది. రెమాల్ తుపాను కూడా బంగ్లాదేశ్ వైపు మరలిపోవడంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడానికి అనువైన వాతావరణం ఏర్పడింది. గతేడాది సరైన వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతన్నలకు ఈసారి గుడ్ న్యూస్ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నెలలో సాధారణ వర్షపాతాన్ని మించి వర్షాలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతట ఈసారి వర్షాలు పుష్కలంగా కురుస్తాయని వాతావరణ విభాగం చెబుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు.
రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ‘ఎల్ నినో’ దశ ముగిసిపోతోందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. దాని స్థానంలో జులై- సెప్టెంబరులో ‘లా నినా’ ఏర్పడటానికి అవకాశం ఉందని వివరించింది. దీనివల్ల రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలు పడటానికి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది జూన్-ఆగస్టులో తటస్థ పరిస్థితులు నెలకొనడానికి గానీ లానినా ఏర్పడటానికి గానీ అవకాశాలు 50 శాతం వరకూ ఉన్నాయని వివరించింది. లానినాకు జులై నుంచి సెప్టెంబరు మధ్య 60 శాతం, ఆగస్టు నుంచి నవంబరు మధ్య 70 శాతం మేర అవకాశాలు ఉన్నాయని వాతావరణ సంస్థ తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…