ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్‌ ఇదే!

డాక్టర్ పై కన్నేసిన ఓ మహిళ దారుణానికి పాల్పడింది. అప్పటికే వివాహమైన డాక్టర్ ను ఎలాగైనా దక్కించుకోవాలని పథకం వేసిన సదరు మహిళ అతడి భార్యను అడ్డు తొలగించాలని పథకం వేసింది. ఇందులో భాగంగా ఓ యాక్సిడెంట్ డ్రామా ఆడి HIV ఇంజక్షన్ వేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్‌ ఇదే!
Kurnool HIV injection case

Edited By:

Updated on: Jan 25, 2026 | 8:44 AM

కర్నూలు, జనవరి 25: వివాహేతర సంబంధం ఓ మహిళ నిండు జీవితానికి ఎసరు పెట్టింది. సదరు మహిళను , ఆమె భర్తను విడదీసేందుకు.. భర్త ప్రియురాలు దారుణానికి పాల్పడింది. ఏకంగా హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌తో దాడి చేసి, చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా గణేష్‌ నగర్‌లో చోటు చేసుకుంది. కర్నూలు డీఎస్పీ బాబూప్రసాద్, సీఐ శేషయ్య తెలిపిన వివరాల ప్రకారం..

కర్నూలుకు చెందిన వైద్యుడికి నందికొట్కూరు రోడ్డులోని మల్లారెడ్డి వెంచర్‌లో నివాసముంటున్న బీచుపల్లి బోయ వసుంధరతో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అయితే వైద్యుడికి ఇటీవల వివాహం జరగడంతో వసుంధరను దూరం పెట్టడం ప్రారంభించాడు. దీంతో భార్యాభర్తలను విడదీస్తే తాను మరింత దగ్గర కావొచ్చన్న దురుద్దేశంతో వసుంధర దారుణానికి ఒడిగట్టింది. ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన కొంగె జ్యోతి, భూమా జస్వంత్, భూమా శృతితో కలిసి ప్రియుడి భార్యపై దాడికి పథకం పన్నింది.

ఈ క్రమంలో జనవరి 9వ తేదీన వైద్యుడి భార్య స్కూటీపై బయటకు వెళ్లగా లక్ష్మీనగర్‌ కేసీ కెనాల్‌ గట్టు వద్ద ఆమె వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో కింద పడిపోయిన వైద్యుడి భార్యకు సాయం చేస్తున్న నెపంతో ఆమెను ఆటోలో ఎక్కించారు. అప్పటికే ఆటోలో సిద్ధంగా ఉన్న వసుంధర ఆమెపై హైచ్‌ఐవీ ఇంజెక్షన్‌తో దాడి దిగింది. ఈ క్రమంలో బాధిత మహిళ పెద్దగా కేకలు వేయడంతో హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ వేసి అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పడంతో ఆయన మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని చికిత్స తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా  నిందితులను గుర్తించి వసుంధర, ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బాబు ప్రసాద్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.