అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..

రాయ‌ల‌సీమ ర‌త‌నాల సీమ అని ఎవ‌ర‌న్నారో గానీ, దానిని నిజం చేస్తూ అక్కడి మట్టిలో వజ్రాలు దొరుకుతుంటాయి. సాధారణంగా వర్షం పడితే మంచి మట్టి వాసన రావడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ నాలుగు చినుకులు పడితే చాలు మ‌ట్టి నుంచి వ‌జ్రాలు బయటపడతాయి. ఇప్పుడు వర్షాకాలం మొద‌లు కావ‌డంతో మే నెల మధ్యలోనే వ‌జ్రాల కోసం వేట ప్రారంభించారు స్థానికులు.

అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
Kurnool And Anantapur

Edited By: Srikar T

Updated on: May 19, 2024 | 12:48 PM

రాయ‌ల‌సీమ ర‌త‌నాల సీమ అని ఎవ‌ర‌న్నారో గానీ, దానిని నిజం చేస్తూ అక్కడి మట్టిలో వజ్రాలు దొరుకుతుంటాయి. సాధారణంగా వర్షం పడితే మంచి మట్టి వాసన రావడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ నాలుగు చినుకులు పడితే చాలు మ‌ట్టి నుంచి వ‌జ్రాలు బయటపడతాయి. ఇప్పుడు వర్షాకాలం మొద‌లు కావ‌డంతో మే నెల మధ్యలోనే వ‌జ్రాల కోసం వేట ప్రారంభించారు స్థానికులు. క‌ర్నూలు జిల్లా తుగ్గిలి, జొన్నగిరి, అనంత‌పురం జిల్లా వ‌జ్రక‌రూరులో వ‌జ్రాల కోసం వేట మొద‌లైంది. ఈ ప్రాంతాలతో పాటు ఎమ్మిగనూరు, కోసిగిలోని పంటపొలాల్తొలో కూడా వజ్రాలు లభిస్తూ ఉంటాయి. తొలక‌రి జ‌ల్లుల‌కు పొలాల్లో వ‌జ్రపు రాళ్లు బ‌య‌ట‌ప‌డుతుంటాయి. చిన్న రాయి దొరికినా చాలు త‌మ జీవితాలు మారిపోతాయ‌నే ఆశ‌తో జ‌నం పెద్ద ఎత్తున సంబంధిత గ్రామాల్లో జ‌ల్లెడ ప‌డుతున్నారు. స్థానికంగానేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వజ్రాల వేట కోసం వస్తూ ఉంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు.

సాధార‌ణంగా జూన్‌, జూలై మాసాల్లో వ‌ర్షాలు ప‌డుతుంటాయి. ఈ ఏడాది కాస్త ముందుగానే తొలకరి చినుకులు పలకరించాయి. ఈ నేప‌థ్యంలో తుగ్గిలి, వ‌జ్రక‌రూరు పొలాల్లో స్థానికుల‌తో పాటు స‌మీపంలోని క‌ర్నూలు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజ‌లు వెతుకులాట ప్రారంభించారు. గ‌తంలో చాలా మందికి వ‌జ్రాలు దొరికిన సందర్భాలు ఉన్నాయి. ఇవి అధిక ధరకు అమ్ముడుపోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రజ‌లు భారీ సంఖ్యలో సంబంధిత ప్రాంతాల‌కు వెళుతున్నారు. వీరిలో ఉద్యోగులు సైతం ఉన్నారు. ఉద‌యాన్నే వెళ్లి సాయంత్రం వ‌ర‌కు వెతుకుతున్నారు. వ‌జ్రాల వ్యాపారులు కూడా ఆ ప్రాంతాల‌పై ప్రత్యేక దృష్టి సారించారు. త‌మ మ‌నుషుల్ని స‌మీప ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. ఎవ‌రికైనా వ‌జ్రాన్ని పోలిన చిన్న రాయి దొరికినా, దాని నిగ్గు తేల్చేందుకు వ్యాపారులు రెడీగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు పట్టుబడినప్పుడు ఒక్క బ్యాగో, ఒక్క నోట్ల కట్ట దొరికితే చాలు అనుకునే వాళ్లు ఇప్పుడు ఒక్క వ‌జ్రం దొరికితే చాలు జీవితమే మారిపోతుందని ఆశను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆశ వారిలో నడుము ఒంచి పట్టివైపు కళ్లుతిప్పేలా చేస్తోంది.. వజ్రం కోసం వారిలో స‌హనాన్ని పెంచుతోంది. ఈ రోజు కాకుంటే రేపైనా త‌మ ప్రయ‌త్నం ఫ‌లించ‌క‌పోతుందా? అని రోజుల త‌ర‌బ‌డి వ‌జ్రాల కోసం అన్వేషిస్తున్నారు. కేవలం పెద్దలు మాత్రమే కాదు, పిల్లా జల్లా, ముసలి ముతక ప్రతి ఒక్కరూ వజ్రాల వేటలో నిమఘ్నమయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..