కరోనా మందుల పంపిణీ వీలైనంత త్వరలో మొదలు పెడుతామని కృష్ణపట్నం ఆనందయ్య ప్రకటించారు. ఇప్పుడే కృష్ణపట్నం రావద్దని ప్రజలకు కోరుతున్నారు. మందుల తయారీకి కావాల్సిన మూలికలు సిద్ధం చేసుకోవాల్సి ఉందని అన్నారు. మూడు రోజుల వరకు ఎవరూ కృష్ణపట్నం రావద్దని, మందుల తయారీ మొదలుపెట్టడానికి ముందు ప్రకటిస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత వరకు దేశవ్యాప్తంగా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
15 రోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆనందయ్య తిరిగి కృష్ణపట్నం చేరుకున్నాడు. కరోనా మందుల పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆయన సోమవారం ఆనందయ్య బయటకు వచ్చారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెంటబెట్టుకుని కృష్ణపట్నంలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆనందయ్య మీడియాతో మాట్లాడుతూ.. మందుల పంపిణీకి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు. అనుమతులు రావడానికి ఎమ్మెల్యే కాకాణి ఎంతో కృషి చేశారని అన్నారు. కాగా నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు కృష్ణపట్నం సందర్శించారు.