
ఇటీవల అనుమానాస్పద కాల్స్ వస్తున్నాయని పలువురు భక్తులు దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. దేవస్థానం తరపున ఎవరు వ్యక్తిగతంగా ఫోన్ చేసి వివరాలు , చెల్లింపులు లేదా బ్యాంకు వివరాలు అడగబోమని ఆలయ ఈవో శీనా నాయక స్పష్టంగా ప్రకటించారు. భక్తులు కావలసిన దర్శనం, అర్జిత సేవలు , ప్రత్యేక పూజలు వివరాలు దేశంలో ఉన్నా.. విదేశాలలో ఉన్నా కేవలం ఆలయ అధికారిక వెబ్సైట్ , సమాచార కేంద్రం లేదా మన మిత్ర వాట్సప్ సేవల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని సూచనలు చేశారు.
ఈ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి
డబ్బులు చెల్లిస్తే అమ్మవారి చీరలు పంపిస్తామంటూ లేదా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని చెప్పే ఫోన్లు దేవస్థానం నుంచి రావని.. అవి పూర్తిగా సైబర్ మోసగాళ్ల ప్రయత్నమేనని ఈవో వెల్లడించారు. ఇలాంటి ఘటనలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో భక్తులలో అవగాహన పెంచేందుకు ఆలయ ప్రాంగణంలో మైక్ ద్వారా తరచూ హెచ్చరికలు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా సూచనల బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
దేవస్థానం వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్స్
అదేవిధంగా దర్శనం లేదా అర్జిత సేవల టికెట్ బుకింగ్.. దేవస్థానం అధికారిక వెబ్ సైట్ లోనే ఉంటుందని.. ఫోన్ ద్వారా ఎలాంటి బుకింగ్ సదుపాయం లేదని స్పష్టం చేశారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, యూపీఐ లింకులు పంపితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని భక్తులకు అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
భక్తులకు విజ్ఞప్తి
భక్తులకు ఏవైనా అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే వెంటనే పోలీసులకు లేదా దేవస్థానం అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు పై కఠిన చర్యలు తీసుకునేందుకు సంబంధిత విభాగాలతో సమన్వయం చేస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.