IPL 2025: ఐపీఎల్‌లో ఆడనున్న గోదావరి కుర్రోడు.. ఏ జట్టు కొనుగోలు చేసిందో తెలుసా?

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కుర్రాడు, ఫాస్ట్ బౌలర్ పీవీ సత్యనారాయణరాజు మెగా వేలంలో ముంబాయి ఇండియన్స్ జట్టుకు ఎంపికవడంతో క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇంతకీ ఎవరు ఈ పీవీ సత్యనారాయణరాజు?

IPL 2025: ఐపీఎల్‌లో ఆడనున్న గోదావరి కుర్రోడు.. ఏ జట్టు కొనుగోలు చేసిందో తెలుసా?
Kakinada Cricketer Satyanarayana Raju Selected By Mumbai Indians In Ipl

Edited By:

Updated on: Nov 27, 2024 | 10:28 PM

ఐపీఎల్.. జట్లను తయారుచేసుకునేందుకు ప్రాంచైజీలు ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయడం మొదలు నుంచి మ్యాచ్‌లు ముగిసే వరకు ఆసక్తికరమే.. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కుర్రాడు, ఫాస్ట్ బౌలర్ పీవీ సత్యనారాయణరాజు మెగా వేలంలో ముంబాయి ఇండియన్స్ జట్టుకు ఎంపికవడంతో క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్న మఠానికి చెందిన సత్యనారాయణరాజు పదిహేనేళ్లుగా కాకినాడ వెంకట నగర్లో ఉంటున్నాడు. తండ్రి రమేష్ రాజు రొయ్యల వ్యాపారి, అమ్మ గృహిణి.. వీరి చిన్నకుమారుడు పాండురంగరాజు కూడా క్రికెటరే… రమేస్ రాజుకు ఆదినుంచి క్రికెట్ అంటే మక్కువ….కుటుంబ పరిస్థితుల రీత్యా ఆడలేకపోయానని.. తన పిల్లలనైనా క్రికెటర్లను చేయాలని తపన పడ్డాడు…. దీంతో కాకినాడకు మకాం మార్చాడు. అక్కడ వారికి శిక్షణ ఇప్పించారు. మైదానంలో వారు పోర్లు, సిక్స్లు కొడుతుంటే ఈయన మురిసిపోయేవాడు.. ఒకరు బ్యాటింగ్, మరొకరు బౌలింగ్లో రాణించేవారు. రంగరాయ వైద్య కళాశాల మైదానంలో సాదన చేసే సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరపున అన్ని మ్యాచ్లు ఆడాడు.

అండర్-14 విభాగంలో తొలిసారి జోనల్ మ్యాచ్లో ఆడటం, తర్వాత రాష్ట్రజట్టులో చోటు దక్కడంతో కోచ్‌ల దృష్టిలో సత్యనారాయణరాజు పడ్డాడు. ఇంటర్ ఆదిత్య, డిగ్రీ విశాఖలోని బుల్లయ్య కళాశాలలో చదవగా ఇటీవల చెన్నైలో ఎంబీఏ పూర్తిచేశాడు. గతేడాది రెండు రంజీ మ్యాచ్లు ఆడేందుకు అవకాశం రాగా.. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీఖాన్ జట్టు తరపున ఆంధ్రా నుంచి ఆడి మెరిశాడు. విజయ హజారే వన్డే మ్యాచ్లు, టీ-20 మ్యాచ్లోనూ బౌలింగ్లో ఉత్తమ ప్రతిభ చూపాడు. ఏసీఏ ఈసారి 15మంది కుర్రాళ్లను ప్రతిపాదించగా.. వారిలో మొదటగా సత్యనారాయణరాజును వేలంలో రూ.30 లక్షలకు ముంబాయి ఇండియన్స్ జట్టు కోసం ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఈ సందర్భంగా సత్యనారాయణరాజు తండ్రి మాట్లాడుతూ.. పిల్లల కోసం తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేస్తుంటారని, సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజాలతో తన కుమారుడు డ్రెస్సింగ్ రూమ్ పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మాటల్లో చెప్పలేని భావోద్వేగానికి గురయ్యారు. తను మొదటినుంచి సచిన్ అభిమానిని, భారత్ తరపున ఆడాలనేది తన కల అని, బుమ్రాతో కలిసి బౌలింగ్ పంచుకోవాలనేది తన కోరిక అని ఆయన చెప్పుకొచ్చారు.