
ప్రశాంతంగా ఆహ్లాదాన్ని ఆస్వాదించేందుకు టూర్లకు వెళుతూ ఉంటారు. అందులోనూ కొంచెం సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారింది. అలాంటిది దీనిని అలుసుగా తీసుకుంటున్న కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు టూరిస్టులను మోసం చేసే పనిలో పడ్డాయి. ఒకటి రెండు టూర్లు సక్రమంగా వేయటం ఆ తరువాత వారిని మోసం చేసి ఉడాయించడం ఇదే పనిగా పెట్టుకున్నారు కొందరు ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు. ఇప్పుడు ఇలాంటి ఘటననే ఒకటి బయటపడింది. కడప కేంద్రంగా నిర్వహిస్తున్న ఏజెన్సీ రామేశ్వరం అలాగే, శ్రీలంక టూర్ వెళ్తున్న టూరిస్టులను మోసం చేసింది. వారిని ఇక్కడి నుంచి శ్రీలంక పంపించి చేతులు దులుపుకున్నారు. దీంతో అక్కడే చిక్కుకుపోయారు టూరిస్టులు.
కడప జిల్లా కేంద్రానికి చెందిన ఉదయ్ అనే వ్యక్తి గో న్యూ హాలిడేస్ పేరుతో ఓ సైట్ క్రియేట్ చేశాడు. దాని ద్వారా టూరిస్టులను వివిధ ప్రాంతాలకు తీసుకు వెళ్తునట్లు ప్రచారం చేసుకున్నాడు. అందులో భాగంగానే ఈసారి కూడా రామేశ్వరం అలాగే అటు నుంచి శ్రీలంక వెళ్లడానికి టూరిస్టులు అతనిని సంప్రదించారు దీంతో మనిషి ఒక్కంటికి రూ. 55,000 చొప్పున వసూలు చేసి, 51 మంది టూరిస్టులను రామేశ్వరం తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఫ్లైట్లో శ్రీలంక తీసుకువెళ్లాలి.
అయితే వారితో టూరిస్ట్ ఏజెన్సీకి సంబంధించిన ఎవరు అందుబాటులో లేరు. ఫ్లైట్ ఎక్కే సమయంలో ఇదే విషయం టూరిస్టులు ఉదయ్ అనే ట్రావెల్ ఏజెంట్ ను అడుగగా అక్కడ మా ఏజెంట్ మిమ్ములను రిసీవ్ చేసుకుంటారని వారికి మాయ మాటలు చెప్పి పంపించాడు. తీరా ఇక్కడి నుంచి వెళ్లిన టూరిస్టులు అక్కడ రిసీవ్ చేసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో అసలు విషయం ఆరా తీశారు. ట్రావెల్ ఏజెన్సీ పేరుతో మోసం చేసినట్లు గుర్తించారు. శ్రీలంకలో ఉండలేక, భారత్ తిరిగి రాలేక టూరిస్టులు ఇబ్బందులకు గురయ్యారు. తమకు జరిగిన మోసాన్ని టీవీ9 దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించి కొంత డేటా ఇవ్వడంతో టీవీ9 తెలుగులో దీనిపై వార్త ప్రచురితమైంది. దీంతో కడపకు సంబంధించిన పోలీసులు టీవీ9లో ప్రచురితమైన వార్త ద్వారా అక్కడ ఉన్న బాధితులను సంప్రదించారు. వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..
అయితే ఇక్కడ అసలు కథ వెలుగులోకి వచ్చింది. గతంలో ఈ ఉదయ్ అనే వ్యక్తి వారిని భారతదేశంలోని కొన్ని టూరిస్ట్ ప్లేసులకు తీసుకువెళ్లాడు. ఆ నమ్మకంతోనే వారు ఇలా విదేశాలకు కూడా వెళ్లడానికి అతనిని సంప్రదించారు. దీనిని అలుసుగా తీసుకున్న ఉదయ్ అనే ట్రావెల్ ఏజెంట్, వారిని మోసం చేసి కనీసం అందుబాటులో లేకుండా టూరిస్టులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. టీవీ 9 చొరవతో శ్రీలంకలో చిక్కుకున్న టూరిస్టులను రప్పించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 6వ తేదీన వారికి రిటర్న్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించారు. వాటిని ఇక్కడ ఉన్న ఏజెంట్ క్యాన్సిల్ చేయకుండా చూడాలని వారు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. టూరిజం ప్రాంతాలకు వెళ్లే సమయంలో ట్రావెల్ ఏజన్సీలను సంప్రదించడం కొంత మంచిదే..! అయినప్పటికీ సరియైన ట్రావెల్ ఏజెన్సీలను ఎంచుకోవడం కూడా అందులో భాగమే. ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బులు ఇస్తే ఈ విధమైన చిక్కులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..