AP News: జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌, టీడీపీ వాలంటీర్ల మధ్య ఘర్షణ

ఆచంట రా.. కదలిరా సభలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌, టీడీపీ వాలంటీర్ల ఫైట్‌ కలకలం రేపింది. అటు తిరువూరు సభలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను తొలగించడం రచ్చకు కారణమైంది. ఇలాంటి ఘటనలు రిపీట్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాలంటీర్లకు సీనియర్లు సూచించారు.

AP News: జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌, టీడీపీ వాలంటీర్ల మధ్య ఘర్షణ
Jr Ntr Fans

Updated on: Jan 08, 2024 | 9:35 AM

పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో టీడీపీ నిర్వహించిన రా.. కదలిరా సభలో కలకలం రేగింది. జూనియర్‌ ఎన్టీఆర్ బ్యానర్లు, ఫ్లెక్సీలతో వేదికపైకి దూసుకుపోయేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించారు. వారిని టీడీపీ వాలంటీర్లు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌, టీడీపీ వాలంటీర్లు కొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. ఆపేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించినా అటు టీడీపీ వాలంటీర్లు కానీ, ఇటు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కానీ వినిపించుకోలేదు. అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు సభలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌ సీఎం అని రాసి ఉన్న బ్యానర్లు, జెండాలను ఫ్యాన్స్‌ ప్రదర్శించారు. జెండాలు, బ్యానర్లు లాక్కొన్న టీడీపీ వాలంటీర్లు వాటిని పక్కన పడేశారు. ఆగ్రహించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ టీడీపీ వాలంటీర్ల తీరును తప్పుబట్టారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌, టీడీపీ వాలంటీర్లు కొట్టుకోవడంపై తెలుగుదేశం నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఘటనల వెనుక ఎవరిదైనా హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇకపై నిర్వహించే సభల్లో సంయమనంతో వ్యవహరించాలని టీడీపీ వాలంటీర్లకు పార్టీ సీనియర్‌ నేతలు సూచించినట్లు తెలిసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..