మంగళగిరి, జూన్ 09: ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. పొత్తులకు ముందే తమే అక్కడి నుంచి పోటీ చేస్తామంటు ప్రకటించుకుంటున్నాయి పార్టీలు. తాజాగా జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ పరస్పరం పొత్తు అధికారికంగా ఖరారైతే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ను జనసేన పార్టీకి కేటాయించాలని మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాస రావు డిమాండ్ చేశాడు. తాను మొదటి నుంచి ఇదే అడుగుతున్నానని ఆయన అన్నారు. మంగళగిరిలోని గౌతమ బుద్ధ రోడ్డు వెంబడి గల జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం వారు బలంగా ఉన్నారని.. టీడీపీ జనసేనల మధ్య పొత్తు కుదిరితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తామని అన్నారు.
ఆ తర్వాత మేయర్ టిక్కెట్ కూడా ఇవ్వాలని అభ్యర్థిస్తామని తెలిపారు. జనసేన తరపున తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలని మొదటి నుంచి ఆశిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ పార్టీకి టికెట్ ను కేటాయించని పక్షంలో భవిష్యత్తు పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకుంటానని వ్యాఖ్యానించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 2019లో మంగళగిరి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో మంగళగిరిలో గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానని లోకేష్ ఇప్పటికే పలుమార్లు స్వయంగా వెల్లడించారు. ఇందుకు తగినట్లుగా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలకు సొంత నిధులు వెచ్చిస్తున్నారు. జనసేనతో టిడిపి పొత్తు కుదిరితే మంగళగిరి టికెట్ ఒప్పందంలో భాగంగా ఏ పార్టీని వరిస్తుందో వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం