ఎన్నికల వేళ టీడీపీ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు మరోసారి కలకలం రేపాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ప్రదర్శించారు ఫ్యాన్స్. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఫ్లెక్సీలు ప్రదర్శించారు. జై ఎన్టీఆర్.. సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. మొన్న పెనుకొండ టీడీపీ ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం రేపాయి. అభ్యర్థి సవితమ్మ నామినేషన్ ర్యాలీలో తారక్ పేరుతో నినాదాలు చేశారు. కూటమి జెండాలతో పాటు ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ జెండాలు ప్రదర్శించారు. ఫ్యూచర్ సీఎం అంటూ నినాదాలు చేశారు అభిమానులు.
మొన్న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొడాలి నాని కీలక కామెంట్స్ చేశారు. కోడాలి నానికి మద్దతు తెలిపారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అభిమానులందరూ కష్టపడి టీడీపీని గెలిపిస్తే.. ఎన్టీఆర్‌ను తుంగలో తొక్కి, లోకేష్ ను అందలం ఎక్కిస్తారన్నారు కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే, అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని సూచించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టిడిపి కార్యక్రమాలకు వెళితే… ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేస్తున్నారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీని చిత్తూ చిత్తుగా ఓడిస్తేనే పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి వస్తాయన్నారు కొడాలి నాని. పెద్ద ఎన్టీఆర్‌ను చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారన్నారు కొడాలి నాని.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…