Pawan Kalyan: నేడు రణస్థలంలో జనసేన యువశక్తి కార్యక్రమం.. ఏర్పాట్లు పూర్తి.. ఉత్తరాంధ్రకు చేరుకున్న పవన్ కళ్యాణ్

|

Jan 12, 2023 | 7:15 AM

యువతకు స్ఫూర్తి ప్రధాత అయిన స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం సమీపంలోని తాళ్లవలస వద్ద యువశక్తి పేరిట జనసేన పార్టీ భారీ బహిరంగను నిర్వహిస్తుంది. యువశక్త వేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేశారు.

Pawan Kalyan: నేడు రణస్థలంలో జనసేన యువశక్తి కార్యక్రమం.. ఏర్పాట్లు పూర్తి.. ఉత్తరాంధ్రకు చేరుకున్న పవన్ కళ్యాణ్
Janasena Yuvashakti
Follow us on

శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ చేపట్టనున్న యువశక్తి కార్యక్రమాన్ని జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పవన్ కళ్యాణ్ బహిరంగసభ కోసం భారీ ఏర్పాట్లను చేసింది. కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర యువతను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో పెట్టుకొని రెండు తీర్మానాలు చేయనుండి ఆ పార్టీ. యువశక్తి సభ ద్వారా జనసేన భవిష్యత్తు గళం వినిపిస్తుందని జనసేన నేతలు చెబుతున్నారు. మరోవైపు పవన్ బహిరంగ సభ నేపథ్యంలో అధికార, జనసేన పార్టీ నేతల మధ్య నెలకొన్న మాటల యుద్ధంతో పొలిటికల్ హీట్ రాజుకుంది.

యువతకు స్ఫూర్తి ప్రధాత అయిన స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం సమీపంలోని తాళ్లవలస వద్ద యువశక్తి పేరిట జనసేన పార్టీ భారీ బహిరంగను నిర్వహిస్తుంది. యువశక్త వేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేశారు. జాతీయ రహదారి పక్కనే 35 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసారు. సభా ప్రాంగణంలోకి వచ్చే వారికోసం 4 ఎంట్రన్స్ గేట్లు ఇచ్చారు. వాటికి ఉత్తరాంధ్రకు చెందిన మహనీయులు గిడుగు రామ్మూర్తి, వీరనారి గునన్నము, అల్లూరి సీతారామరాజ, కోడి రామమూర్తి పేర్లు పెట్టారు. కార్యక్రమానికి వచ్చే యువతకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 7 గంటల వరకూ కార్యక్రమం సాగనుంది. మొదటగా జనసేన పార్టీ తరపున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వారిని సభకు పరిచయ కార్యక్రమం మొదలవుతుంది. అనంతరంసంస్కృతిక కార్యక్రమాలతో పాటు, ప్రత్యేకంగా ఎంపిక చేసిన వంద మంది యువత వివిధ అంశాల మీద మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు సంబంధించి రెండు తీర్మానాలను చేయనున్నారు. పవన్ కల్యాణ్ తన ఉపన్యాసంలో ఉత్తరాంధ్ర సమస్యలతో పాటు యువ నాయకత్వాన్ని అణిచివేస్తున్న కొన్ని కుటుంబ పాలకుల వైఖరి మీద, రాజకీయ అంశాల మీద, పార్టీ భవితవ్యం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడనునట్లు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో రెండు రోజుల ముందు నుంచే శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం హీటెక్కింది. జనసేన చేపట్టే యువశక్తి కార్యక్రమానికి నారా శక్తి అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి విడుదల రజిని ఎద్దేవా చేయగా జిల్లాకు చెందిన మంత్రి సీదిరీ అప్పలరాజు సైతం యువశక్తిపై ఆరోపణలు సంధించారు.

అయితే అధికార పార్టీ నాయకులకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, నాగబాబు. వారి మాటలను తాము పట్టించుకోమని తెలిపారు. విశాఖ ప్రత్యేక రాష్ట్రం కావాలని మంత్రి ధర్మానతో జగన్ రెడ్డి మాట్లాడిస్తున్నారా?  వైసీపీ విధానం రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడమా?? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.

పవన్ సభకు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జి.ఆర్‌.రాధిక మంగళవారం సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. సభా వేదిక, గ్యాలరీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మరోవైపు బహిరంగ సభ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రే ఉత్తరాంధ్రకు చేరుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..