Pawan Kalyan: ‘పొత్తు ధర్మాన్ని టీడీపీ ఉల్లంఘించింది’.. జనసేనాని కీలక వ్యాఖ్యలు..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బరిలో దిగాలని భావించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరుణంలో టీడీపీతో పొత్తుపై పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం ఉల్లంఘించిందన్నారు జనసేన అధినేత పవన్‌. జనసేనతో చర్చించకుండానే సీట్లు ఎలా ప్రకటిస్తారు? అని అడిగారు జనసేనాని.

Pawan Kalyan: పొత్తు ధర్మాన్ని టీడీపీ ఉల్లంఘించింది.. జనసేనాని కీలక వ్యాఖ్యలు..
Pawan Kalyan

Updated on: Jan 26, 2024 | 12:56 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బరిలో దిగాలని భావించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరుణంలో టీడీపీతో పొత్తుపై పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం ఉల్లంఘించిందన్నారు జనసేన అధినేత పవన్‌. జనసేనతో చర్చించకుండానే సీట్లు ఎలా ప్రకటిస్తారు? అని అడిగారు జనసేనాని. సర్దుబాటుకు ముందే అభ్యర్థుల్ని ప్రకటించడం సరికాదన్నారు. పొత్తులో ఉండగా మండపేట అభ్యర్థిని చంద్రబాబు ఎలా ప్రకటిస్తారు? అని ప్రశ్నించారు. చంద్రబాబే సీఎం అభ్యర్థి అని లోకేష్‌ ప్రకటించినా నేను మౌనంగా ఉన్నా! అని గుర్తు చేశారు. జగన్‌ను గద్దె దించడం కోసమే నేను సంయమనంతో ఉన్నానన్నారు. పొత్తు విచ్ఛిన్నం కావాలంటే ఎంతసేపు? అని తన భావనను వ్యక్తం చేశారు. పొత్తు ధర్మం పాటించకుండా అభ్యర్థుల్ని ప్రకటించడం ఏంటి? అని నిలదీశారు. టీడీపీ ప్రకటన జనసేన నేతలను ఆందోళనకు గురిచేసిందన్నారు పవన్. మండపేటలో జనసేనకు 18శాతం ఓట్లు వచ్చాయ్‌, ఇప్పుడది 28శాతానికి పెరిగిందని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలోనే టీడీపీకి కౌంటర్‌గా అభ్యర్థులను ప్రకటించారు పవన్‌. రాజోలు, రాజానగరంలో జనసేనే పోటీ చేస్తుందని చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ రెండు సీట్లు ప్రకటిస్తున్నా అని వివరించారు. చంద్రబాబుకు ఉన్నట్టే నాకూ ఒత్తిడి ఉందన్నారు పవన్ కళ్యాణ్. పొత్తు ఇబ్బందికరమే.. కానీ టీడీపీతోనే కలిసి వెళ్తాం అని తేల్చి చెప్పారు. పొత్తులో ఉన్నప్పుడు ఒక మాట ఎక్కువా తక్కువా ఉంటుందని, ఎన్ని ఆటుపోట్లు ఉన్నా టీడీపీతో ముందుకెళ్తామన్నారు. జనసేన పోటీచేసే స్థానాలపై పవన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 50 నుంచి 70 సీట్లు తీసుకోవాలని కొందరు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్ని సీట్లు తీసుకోవాలో నాకు తెలుసు అని వారికి బదులిచ్చారు పవన్. ఒంటరిగా వెళ్తే సీట్లు సాధిస్తాం.. కానీ ప్రభుత్వం రాదు! అని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమీ తెలియకుండానే నేను రాజకీయాల్లోకి వచ్చానా! అని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో కచ్చితంగా మూడో వంతు సీట్లు తీసుకుంటామన్నారు. 2019 ఎన్నికల్లో 18లక్షలకు పైగా ఓట్లు సాధించినట్లు వెల్లడించారు. జనసేనకు బలం ఉంది కాబట్టే మనకీ గౌరవం అన్నారు.

ఈ సందర్భంగానే సీఎం జగన్‌, వైఎస్ షర్మిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్‌. సొంత చెల్లినే వదలని వ్యక్తి మనల్ని వదులుతారా? అంటూనే.. జగన్‌కు ఊరంతా శత్రువులే అని కీలక కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలకు కష్టం వస్తే నా దగ్గరకే రావాల్సి వస్తుందని పేర్కొన్నారు. నాది పెద్దమనసు.. నా దగ్గరకు వస్తే అండగా ఉంటా అని ధైర్యం చెప్పారు. 2024లో ఎట్టిపరిస్థితుల్లోనూ జగన్‌ ప్రభుత్వం రాదని ఎన్నికల ఫలితాలపై పవన్‌ కల్యాణ్‌ జోస్యం చెప్పారు. నేరుగా మీడియాను అడ్రస్‌ చేసే ధైర్యం కూడా జగన్‌కు లేదన్నారు.
జగన్‌పై వ్యక్తిగతంగా నాకెలాంటి కక్ష లేదని చెబుతూనే.. ప్రజలు ప్రశ్నిస్తారు, ఎదురుతిరుగుతారు, భరించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..