AP Elections 2024: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ రెండు స్థానాలపై జనసేన కన్ను.. రేసులో టాలీవుడ్ సెలబ్రిటీ?

| Edited By: Janardhan Veluru

Jan 25, 2024 | 12:13 PM

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తమకు కేటాయించే సీట్లపై త్వరగా క్లారిటీ ఇవ్వాలని జనసేన కోరుతోంది. అయితే జన సైనికులకు వారు అడిగిన చోట కాకుండా టిడిపి వేరే ఆప్షన్ ఇచ్చిందట.. . ఇప్పటికే జనసేన నుంచి ఇక్కడ పోటీ కోసం పలువురు ప్రయత్నిస్తుండగా..

AP Elections 2024: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ రెండు స్థానాలపై జనసేన కన్ను.. రేసులో టాలీవుడ్ సెలబ్రిటీ?
TDP, Janasena party
Follow us on

టిడిపి – జనసేన పొత్తు విషయంలో క్లారిటీ ఉంది.. కానీ జనసేనకు ఎన్ని అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు, టీడీపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందన్న అంశంలో మాత్రం ఇప్పటికీ కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. అందులోనూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన మేం అడిగిన స్థానాలు మాకే ఇవ్వాలని కోరుతోంది. ఆ రెండు స్థానాల్లో ఎదో ఒకటి మాకు ఇవ్వాలని జనసేన కోరుతుంటే.. మిత్రపక్షమైన టిడిపి మాత్రం ఆ రెండు తప్ప మరో నాలుగు స్థానాలను ఆప్షన్‌గా ఇచ్చి రెండు ఎంచుకోవాలని కోరుతోందన్న టాక్ జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తమకు కేటాయించే సీట్లపై త్వరగా క్లారిటీ ఇవ్వాలని జనసేన కోరుతోంది. అయితే జన సైనికులకు వారు అడిగిన చోట కాకుండా టిడిపి వేరే ఆప్షన్ ఇచ్చిందట.. . ఇప్పటికే జనసేన నుంచి ఇక్కడ పోటీ కోసం పలువురు ప్రయత్నిస్తుండగా.. తాజాగా టాలీవుడ్ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా రేసులో చేరిపోయారు. బుధవారం(జనవరి 24)నాడు జనసేన పార్టీలో చేరిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీకి మంచి పట్టున్న జిల్లా.. అలాంటి చోట ప్రత్యర్థిని కొట్టాలంటే పొత్తు ఉంటే సరిపోదు. పోటీ చేసే అవకాశం కూడా కావాలని అంటున్నారు జనసేన నేతలు. గతంలో నెల్లూరు సిటి నుంచి ప్రజారాజ్యం విజయం సాధించింది. అందుకే జనసేనకు కూడా ఈ జిల్లాలో అవకాశం ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. నెల్లూరు సిటి, నెల్లూరు రూరల్ స్థానాలు ఇవ్వాలని జనసేన గట్టిగానే పట్టుబడుతోందని టాక్ వినిపిస్తోంది. అయితే అక్కడ ఇప్పటికే మాజీమంత్రి నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీకి సిద్ధంగా ఉన్నారు. దీంతో ఆ రెండు స్థానాలు కాకుండా.. జిల్లాలో జనసేన కోసం నాలుగు నియోజకవర్గాలను ఆప్షన్ గా టిడిపి ఇచ్చినట్లు తెలుస్తోంది.

సూళ్లూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు, కావలి నియోజకవర్గాల్లో ఎదో ఒక చోట జనసేనకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంచి సబంధాలు కలిగి ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేనలో చేరారు. ఇప్పటికే ఇక్కడ జనసేన జిల్లా నేతలు పోటీకి ప్రయత్నాలు చేస్తుండగా జానీ మాస్టర్ చేరికతో ఆయన కూడా బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కలిసొచ్చే చోట నుంచి పోటీకి జానీ సిద్ధమయ్యారట. మరి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఇటు టిడిపి, అటు జనసేన జిల్లా నేతలకు ఇంకా సమాచారం లేదట. తాము అడిగిన నియోజకవర్గం ఇవ్వలేదన్న అసంతృప్తిలో ఉన్న తమకు ఇప్పుడు మరో వ్యక్తి పోటీకి సిద్ధమవడంతో తమకు అవకాశాలు దక్కుతాయా లేదా అన్న సందేహం ఆ పార్టీ జిల్లా నాయకుల్లో మొదలయిందట.

జానీ మాస్టర్ జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జానీ పోటీ చేస్తే ఒక్కరికే అవకాశం ఉంటుందా.. మరో నియోజకవర్గం కూడా జనసేనకు టిడిపి అవకాశం ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది.. ఇంతకీ జానీ మనస్సు ఏ స్థానంపై ఉంది. ఇటీవల రెగ్యులర్‌గా నెల్లూరులో జానీ మాస్టర్ పర్యటిస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారికి ఆర్ధికంగా సాయపడుతూ.. ప్రజా సమస్యలపై పోరాటాలు కూడా చేస్తున్న జానీ మాస్టర్ ఈ సారి పోటీ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

స్వతహాగా నెల్లూరు వాసుడైన జానీ అదే స్థానాన్ని కోరుకుంటాగా.. టీడీపీ అధిష్ఠానం మాజీ మంత్రి నారాయణను కాదని జనసేనకు అవకాశం ఇస్తుందా.. లేక టిడిపి చెబుతోన్న ఆ నాలుగు స్థానాల్లో ఎదో ఒక చోట నుంచి అవకాశం ఇస్తే అందుకు జనసేన సిద్ధంగా ఉందా అన్నది తెలియాలి.. ఒకవేళ ఆ స్థానాల్లో ఎదో ఒక చోట నుంచి జానీ మాస్టర్ లేక జిల్లాలో ఉన్న మరెవరైనా పోటీ చేస్తారా అన్నది చూడాల్సివుంది.