
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ నేతలు… ప్రతిపక్ష పార్టీ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం భానుడు భగభగలు మించి కొనసాగుతోంది. ఇరుపార్టీ నేతలు ఒకటి నువ్వు అంటే నేను రెండు అంటా అన్న చందంగా కొనసాగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై చెప్పులు చూపించినందుకు.. మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచాయి. మాజీ మంత్రి వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. ఒంగోలులో ఆందోళనకు దిగిన జనసేన పార్టీ కేడర్..పేర్ని నాని ఫోటోకు చెప్పుల దండవేసి తన ఆగ్రహం వెళ్లగక్కారు.
మాజీ మంత్రి పేర్నినాని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు జనసేన కార్యకర్తల్లో మంటిపుట్టిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేపట్టడంతో ఫుల్ ఖుషీలో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు మాజీ మంత్రి కౌంటర్‌తో ఊగిపోతున్నారు. ఒంగోలులో పేర్ని నాని చిత్రపటానికి చెప్పుల దండ వేసి జనసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పేర్నినాని ఘాటుగా స్పందించారు. అక్కడితో ఆగకుండా రెండు చెప్పులూ చూపిస్తూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ ఒక్క చెప్పు చూపిస్తే తాను రెండు చెప్పులు చూపిస్తున్నానని, మక్కెలిరిగిపోతాయని పవన్‌కు వార్నింగ్ ఇచ్చారు పేర్నినాని. దీంతో మా నాయకుడినే అంత మాటంటావా అంటూ జనసేన కార్యకర్తలు, మా అభిమాన నటుణ్ని తిడతావా అంటూ పవర్ ఫ్యాన్స్ నాని మీద ఓ రేంజులో ఫైరవుతున్నారు.
పేర్ని వ్యాఖ్యలను జనసేన కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. బందరులో పేర్ని నాని ఇక పోటీ చేయలేక.. తన కొడుకును రాజకీయాల్లోకి తెస్తున్నారని, అక్కడ జనసేన కార్యకర్తలు ఈసారి ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో పేర్ని నాని చిత్రపటానికి చెప్పుల దండ వేసి చీపుర్లతో కొట్టి తన ఆగ్రహం వెళ్లగక్కారు. అనంతరం పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక్కడే కాదు చాలా చోట్ల పేర్నినాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు నిరనసన తెలిపారు. పేర్నినాని నోరు అదుపులో ఉంచుకుంటే బావుంటుంది అని జనసేన నేతలు, కార్యకర్తలు హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..