తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో పట్టు కోసం జనసేన ప్రయత్నిస్తోంది. బలిజ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్న చోట పాగా వేసేందుకు పావులు కలుపుతోంది. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి తోపాటు రాజంపేట పార్లమెంటు సీటుపై కన్నేసిన జనసేన పోటీకి ఆసక్తి చూపుతోంది..
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గాలు జనసేనకు దక్కుతాయన్న చర్చ కొనసాగుతోంది. రాజకీయ వర్గాల్లో జనసేన స్థానాల వైపే అందరి చూపు నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో జనసేన ఏఏ స్థానాలు కోరుకుంటుంది, ఎక్కడ పోటీ చేయాలని ఆసక్తి చూపుతుందన్న చర్చ రెండు పార్టీల్లోనూ నెలకొంది. బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో విస్తృత చర్చగా మారింది.
టెంపుల్ సిటీ తిరుపతితో పాటు చిత్తూరు, మదనపల్లి అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ప్రయత్నిస్తున్న జనసేన రాజంపేట పార్లమెంటు సీటుపైనా, ఆ పార్టీకి ఆసక్తి పెరిగిందట. ప్రజారాజ్యం ఆవిర్భావం జరిగిన తిరుపతిలో బలిజ ఓటింగ్ శాతం అధికంగా ఉండడంతో అప్పట్లో ఆ పార్టీ అధినేత చిరంజీవి అసెంబ్లీలో పెట్టే అవకాశం లభించింది. 2009 చిరంజీవిని అక్కున చేర్చుకున్న తిరుపతి అసెంబ్లీ స్థానం జనసేన కూడా సెంటిమెంట్ గా భావిస్తోందట. జనసేనాని నే పోటీ చేస్తే బాగుంటుందన్న చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. దీంతో తిరుపతి అసెంబ్లీని టిడిపి పొత్తుతో సొంతం చేసుకోవచ్చని భావిస్తోందట.
ఇక మదనపల్లి అసెంబ్లీపైనా దృష్టి పెట్టిన జనసేన బలిజ సామాజిక వర్గం ఓటింగ్ గణనీయంగా ఉన్న చోట పోటీకి సై అంటోంది. జనసేన రాయలసీమ కో-కన్వీనర్‌గా కొనసాగుతున్న రామదాస్ చౌదరి మదనపల్లిలో బలమైన నేతగా కొనసాగుతుండటంతో అక్కడ పోటీ చేయాలని చూస్తున్నారట. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మదనపల్లి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన రామదాస్ చౌదరి భార్య గంగారపు స్వాతి గట్టి పోటీని ఇవ్వగా, ప్రస్తుతం మదనపల్లి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. బలిజ సామాజిక వర్గం బలంగా ఉన్న మదనపల్లిలో కమ్మ సామాజిక వర్గంలో పట్టున్న రాందాస్ చౌదరిని దింపితే, టీడీపీ పొత్తు కలిసి వస్తుందని జనసేన హై కమాండ్ భావిస్తోందట.
మరోవైపు చిత్తూరులో పోటీ పైనా పెద్ద చర్చనే జనసేనలో నడుస్తోందట. బలిజలు అధికంగా ఉన్న చిత్తూరులో టీడీపీ కూడా బలంగా ఉండడంతో పొత్తు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్న జనసేన బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని ఆలోచిస్తోందట. మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబం నుంచి ఎవరైనా పోటీకి సిద్ధపడితే జనసేన సై అనే అవకాశం చిత్తూరులో ఉంది. ఇప్పటికే డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య జనసేన కండువా కప్పుకోవడంతో చిత్తూరు అసెంబ్లీ పట్ల ఆసక్తి చూపుతోందట.
ఇక రాజంపేట పార్లమెంటు పరిధిలో బలిజల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడంతో ఎంపీ స్థానం పైన జనసేన దృష్టి పెట్టిందట. డీకే ఆదికేశవుల కుటుంబం రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి 2009, 2019 ఎన్నికల్లో పోటీ చేసింది. 2009లో పీఆర్పీ తరఫున ఆదికేశవులు కొడుకు డిఏ శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయగా, 2019 ఎన్నికల్లో డీకే ఆదికేశవులు భార్య సత్య ప్రభ టిడిపి అభ్యర్థిగా రాజంపేట పార్లమెంటు స్థానానికి పోటీ చేసింది. దీంతో బలిజ సామాజిక వర్గం ప్రభావం చూపే రాజంపేట సీటు పైనా గురి పెట్టిన జనసేన డీకే ఫ్యామిలీ నుంచి బరిలో దింపే ప్రయత్నం కూడా చేస్తోందట.
ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రాబల్యం చాటుకునే ప్రయత్నం చేస్తున్న జనసేన మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు రాజంపేట పార్లమెంటు స్థానాన్ని పరిశీలిస్తోంది. టిడిపితో పొత్తుతో గెలిచే స్థానాలపై ఫోకస్ చేసిన జనసేన ఈ మేరకు కసరత్తు చేస్తుందట.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…