Janasena: పవన్ చేసిన ఆ పనితో విశాఖ టీడీపీలో అలజడి..

|

Feb 19, 2024 | 7:21 PM

విశాఖపై ప్రత్యేకదృష్టి సారించింది జనసేన. రివ్యూలతో స్పీడ్ పెంచిన పవన్ కల్యాణ్.. వైసీపీ సిట్టింగ్ స్థానాల్లో ఇన్‌చార్జ్‌లను ప్రకటించారు. నిజానికి ఆ స్థానాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. మరి వాళ్ల సీటు ఆశలు గల్లంతేనా? పొత్తు ధర్మంలో ఎవరు ఏ సీటు త్యాగం చేయబోతున్నారు?

Janasena: పవన్ చేసిన ఆ పనితో విశాఖ టీడీపీలో అలజడి..
Pawan Kalyan
Follow us on

విశాఖ, ఫిబ్రవరి 19: ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. జనసేన అధినేత పవన్ విశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నేతలతో వన్‌ టు వన్ మాట్లాడారు. ఆర్థిక స్థితిగతులు, రాజకీయ సమీకరణాలపై ఆరాతీశారు. ఆ తర్వాత 4 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు. భీమిలి జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వంశీకృష్ణ శ్రీనివాస్‌, గాజువాకకు సుందరపు సతీష్‌, పెందుర్తిలో పంచకర్ల రమేష్‌, యలమంచిలిలో సుందరపు విజయ్‌ కుమార్‌లను నియమించారు.

అధికారికంగా అభ్యర్థులని కాకుండా సమన్వయకర్తలనే ట్యాగ్‌లైన్ తగిలించి 4 స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు. గత ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అంతకుముందు ఈ నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం గణనీయమైన ప్రభావం చూపింది. ఆ కారణంగానే ఇప్పుడు భీమిలి, గాజువాక, పెందుర్తి, యలమంచిలిలో పోటీ చేస్తే గెలుపు ఖాయమని లెక్కలేసుకుంటోంది.

జనసేన ఇన్‌ఛార్జ్‌ల ప్రకటనతో లోకల్ టీడీపీ నేతల్లో ఉలికిపాటు మొదలైంది. నిజానికి ఆ నాలుగు స్థానాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. భీమిలి నుంచి గంటా శ్రీనివాస్‌.. గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్‌.. పెందుర్తి నుంచి సీనియర్ నేత బండారు సత్యనారాయణ, యలమంచిలి నుంచి ప్రగాఢ నాగేశ్వర్‌రావులు సీటు తమకేనన్న ధీమాతో ఉన్నారు. అయితే వీరిలో సీటు త్యాగం చేసేదెవరు..? పట్టుబట్టి సీటు సాధించుకునేదెవరన్న చర్చ మొదలైంది. ఇక అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో నాగబాబును బరిలోకి దింపాలని జనసేన భావిస్తోంది. ఇదే స్థానంలో టీడీపీ నుంచి చింతకాయల విజయ్‌, బైరా దిలీప్‌ పోటీ చేయాలనుకుంటున్నారు. అధికారికంగా అభ్యర్థుల ప్రకటన చేయకపోయినప్పటికీ జనసేన ఇన్‌ఛార్జ్‌లను నియమించడంతో టీడీపీ నేతల్లో సీటు టెన్షన్ పట్టుకుంది.

సమన్వయకర్తలను ప్రకటించిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా టూర్‌కి బయల్దేరారు పవన్ కల్యాణ్‌. మంగళవారం ఉమ్మడి జిల్లా నేతలతో ప్రత్యేక సమావేశాలతో పాటు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటిస్తారని తెలుస్తోంది. 21న భీమవరంలో టీడీపీ-జనసేన నేతలతో ఆత్మీయ సమావేశంలో పవన్ పాల్గొంటారు. మరోవైపు భీమవరం నుంచి పవన్ పోటీ చేయడం ఖాయమంటున్నారు పార్టీ నేతలు.

ఇన్‌ఛార్జ్‌ల ప్రకటన వేళ పవన్ హస్తిన పర్యటన ఖరారైంది. ఈనెల 22న ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో సమావేశంకానున్నారు. ప్రధానంగా పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపనున్నారు. తిరిగొచ్చాక అధికారికంగా అభ్యర్థుల్ని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..