Janasena: అదిగో 600 ఎకరాలు లే అవుట్.. బర్తరఫ్ చేయండి.. ఏపీ మంత్రి అమర్నాథ్‌ను టార్గెట్ చేసిన జనసేన..
ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను జనసేన టార్గెట్ చేసింది. ఆయన భూదందాలు చేస్తున్నారని ఆరోపించింది. సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. అమర్‌నాథ్‌ను వెంటనే భర్తరఫ్ చేయాలని విస్సన్నపేటలో జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. ఐతే ఈ ఆరోపణలు ఖండించారు మంత్రి అమర్నాథ్.
ఏపీ మంత్రి అమర్నాథ్ అనుచరులతో కలిసి అనకాపల్లి నియోజకవర్గంలో భూ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది జనసేన. అనుచరుల పేరుతో విస్సన్నపేటలో 600 ఎకరాల్లో అక్రమంగా పొంది లే అవుట్ వేసినట్లు చెప్తోంది. 200 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ రికార్డులు ట్యాంపర్ చేశారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఆ భూములతో తనకు సంబంధం లేదంటున్నారు మంత్రి అమర్నాథ్. తన పేరుపై భూమి ఉందని నిరూపిస్తే వారికే రాసిస్తానంటూ కౌంటర్ ఇచ్చారు.
మంత్రి అమర్నాథ్ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు జనసేన నేతలు ప్రకటించారు. విస్సన్నపేటలో ఉన్న 600 ఎకరాల లే అవుట్‌కు ఉమ్మడి విశాఖజిల్లా నుంచి జనసేన శ్రేణులు తరలివచ్చాయి. మంత్రిపై చర్యలు తీసుకునేదాకా పోరాడతామని స్పష్టం చేస్తోంది.
అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం విస్సన్నపేటలో.. మంత్రి అమర్నాథ్ వందల ఎకరాల భూ దోపిడీకి పాల్పడ్డారని జనసేననేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీని వెనక చాలా మంది పెద్దలు ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. స్థానిక రైతులను బెదిరించి..భూములు లాక్కొని లేఅవుట్‌లు వేస్తున్నారని..నిబంధనలను ఉల్లంఘించారని విమర్శించారు.
మంత్రి అమర్నాథ్‌కు చెందిన రియల్ వెంచర్ అయిన కారణంగా.. చర్యలు తీసుకోవడానికి అధికారులు ముందుకు రావడం లేదని జనసేన నేతలు ఆరోపించారు. స్థానిక తహసీల్దారును బదిలీ చేయాలని గతంలోనే ఏసీబీ డీజీ స్థాయి అధికారి సిఫార్సు చేసినా..అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని చర్యలు తీసుకోలేదన్నారు. మొత్తానికి ఈ వ్యవహారం అనకాపల్లిజిల్లానే కాదు, రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం