Nadendla Manohar: “ఎన్నికలు ఎంతో దూరంలో లేవు”.. వైసీపీకి నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్..

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతో జనసేనపై మరో కుట్రకు తెర లేపారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ కుట్రపై రాష్ట్ర డీజీపీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ప్రచారాలు మీడియాకు...

Nadendla Manohar: ఎన్నికలు ఎంతో దూరంలో లేవు.. వైసీపీకి నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్..
Nadendla Manohar

Updated on: Oct 23, 2022 | 6:15 PM

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతో జనసేనపై మరో కుట్రకు తెర లేపారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ కుట్రపై రాష్ట్ర డీజీపీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ప్రచారాలు మీడియాకు ఎవరి ద్వారా వెళ్లాయో తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటమే జన సైనికులకు తెలుసన్న మనోహర్.. జనసైనికులు, వీర మహిళలు వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని జనసేన పార్టీ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని, ప్రజాస్వామ్య పద్ధతుల మీద జనసేనకు అపార గౌరవం ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. జన సైనికులు, వీర మహిళలు వ్యవస్థలు, వ్యక్తుల మీద దాడులు చేసే సంప్రదాయానికి పూర్తి దూరంగా ఉన్నారని చెప్పారు. ప్రజా పోరాటమైనా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. అలాంటి జనసేనపై వైసీపీ ప్రభుత్వం కొత్త కుట్ర మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 మంది వైసీపీ ప్రజా ప్రతినిధులపై జనసేన పార్టీ నేతలు ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం ఉందంటూ పోలీసు ఇంటిలిజెన్స్ నివేదిక అంటూ సమాచారాన్ని మీడియాకు ఇచ్చి, కొత్త కుట్రల ప్రచారం మొదలుపెట్టారని ఆక్షేపించారు.

మా ఫోన్లు, మా మీద నిఘా పెట్టడం మాని ఈ రహస్య అంశాలు ఎలా బయటకు వెళ్తున్నాయో డీజీపీ విచారణ చేయాలి. ఎవరి ద్వారా ఈ ప్రచారాలు బయటకు వెళ్తున్నాయో మాకు తెలుసు. జనసేన పార్టీకి రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతున్న జనాదరణ చూసి అసూయ పడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటన ర్యాలీలో రెచ్చగొట్టాలని, గొడవలు సృష్టించాలని చూశారు. అది సాధ్యం కాకపోవడంతో కొత్త కుట్రలకు తెరలేపారు. అలజడి, అపోహలు, అయోమయం, అనుమానాలు ప్రజల్లో సృష్టించి దీని ద్వారా గొడవలు సృష్టించి, జనసేన పార్టీ మీద నెట్టేయాలన్నదే ఈ పాలకుల ఉద్దేశ్యం. వారి కుట్రలు పారలేదు. టెక్కలిలో జనసేన పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినా ఇప్పటి వరకు ఆ కేసులో పురోగతి సాధించని ఈ ప్రభుత్వం, కొత్త కుట్రలు మొదలుపెట్టిందనే విషయాన్ని జనసైనికులు గుర్తుంచుకోవాలి.

– నాదెండ్ల మనోహర్, జనసేన నేత

ఇవి కూడా చదవండి

వచ్చే ఎన్నికలు ఎంతో దూరంలో లేవన్న మనోహర్.. ఆ సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా తేల్చుకునేందుకు జనసేన సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఎవర్ని ఆదిరిస్తారో, ఎవరి వైపు నిలబడతారో ముందు ముందు అందరికీ తెలుస్తుందన్నారు. జనసేన పార్టీ మీద మీరు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో అవమానాలు, అడ్డగింతలు ఎదురవుతున్నాయని విమర్శించారు. ప్రజా పోరాటాలను కచ్చితంగా జనసేన పార్టీ చేస్తుందని, వాటిని ఎక్కడా అప్రజాస్వామిక పద్ధతుల్లో మాత్రం చేయదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..