ఆంధప్రదేశ్‌లో విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. స్కూళ్లు ప్రారంభమైన రోజు నుంచే రాష్ట్రంలో విద్యా కానుక అందించనున్నారు. వేసవి సెలవుల అనంతరం ఏపీ వ్యాప్తంగా పాఠశాలలు రేపటి నుంచి (జూన్ 12) తిరిగి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి అన్ని పాఠశాలల్లో విద్యా కానుకను అందిస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సుమారు 43 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం కింద యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, బ్యాగ్, ఇంగ్లిష్, తెలుగు (బైలింగ్వల్) టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, నోటు పుస్తకాలు అందించనున్నారు.
విద్యా కానుక కోసం ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,100 కోట్లు ఖర్చు చేస్తోంది. విద్యాకానుక పథకాన్ని సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే ఇప్టపికే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు జగనన్న విద్యా కానుక కిట్లు చేరుకున్నాయి. ఇక విద్యా కానుక కిట్ల నాణ్యత విషయంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. క్వాలిటీని నాలుగు దశల్లో పరిశీలించామని, ఈ ఏడాది యూనిఫాం కుట్టుకూలిని రూ.10 పెంచి రూ. 45 ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ టెన్త, ఇంటర్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట సత్కరించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూన్ 20న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను, హెచ్‌ఎంలనూ సత్కరించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..