అగ్రవర్ణాల మహిళలకు జగన్ సర్కారు కొత్త పథకం, ఈబీసీ నేస్తం పేరుతో ఆర్థికంగా వెనుకబాటులో ఉన్నవారికి ఏడాదికి 15 వేలు

|

Feb 23, 2021 | 4:43 PM

ఆంధ్రప్రదేశ్ లో అగ్రవర్ణాల మహిళలకు జగన్ సర్కారు కొత్త పథకం తీసుకొచ్చింది. ఈబీసీ నేస్తం పేరుతో ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న అగ్రవర్ణాల..

అగ్రవర్ణాల మహిళలకు జగన్ సర్కారు కొత్త పథకం, ఈబీసీ నేస్తం పేరుతో ఆర్థికంగా వెనుకబాటులో ఉన్నవారికి ఏడాదికి 15 వేలు
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో అగ్రవర్ణాల మహిళలకు జగన్ సర్కారు కొత్త పథకం తీసుకొచ్చింది. ఈబీసీ నేస్తం పేరుతో ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న అగ్రవర్ణాల మహిళలకు (ఒసి) ఏడాదికి 15 వేల రూపాయలు ఇవ్వబోతోంది. సదరు మహిళలకు ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున, మూడేళ్లపాటు ఇచ్చేందుకు ఏపీ కేబినెట్‌ ఆమోదించింది. దీనికోసం 670 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. మున్సిపాలిటీల్లో డోర్ టు డోర్ చెత్త సేకరణకు 2వేల 700 వాహనాలు కేటాయిస్తూ కూడా ఇవాళ నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ప్రతి మున్సిపాలిటీని అందంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్‌. మూడు నుంచి ఆరు నెలల్లోగా.. ఏ మున్సిపాలిటీలో కూడా రోడ్లపై గోతులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సూరత్‌తో పోటీ పడేలా మున్సిపాలిటీలను తీర్చిదిద్దాలన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

ఏసీబీ కేసుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వారిపై 100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలనే నిర్ణయాన్ని ఏపీ కేబినెట్‌ ఆమోదించింది. ఆ గడువు ముగిసేలోపు విచారణ జరపకపోతే ఏసీబీ అధికారులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా చట్ట సవరణకు నిర్ణయించింది. 400పైగా ఏసీబీ కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. ప్రజలను పీడించే అధికారులపై వేగంగా చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో ఉంది వైసీపీ ప్రభుత్వం. అందుకే ఇదివరకు ఎంక్వయిరీకి రెండేళ్లున్న గడువును..100 రోజులకి కుదిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పేర్నినాని. కేబినెట్‌ మీటింగ్‌లో కూడా ఉక్కు పరిశ్రమ అంశం చర్చకొచ్చిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయబోతున్నామన్నారు పేర్నినాని.

Read also :

రైతులంటే ప్రధాని మోదీకి చాలా ద్వేషం, అవకాశం వస్తే గోవర్థనగిరి పర్వతం కూడా అమ్మేస్తారు : ప్రియాంక గాంధీ