Visakhapatnam: విశాఖ విమానాశ్రయం మూసివేత? 11 గంటల నుంచి విశాఖకు నో విమానం..

| Edited By: Shiva Prajapati

Aug 05, 2023 | 8:22 AM

రక్షణ వ్యవస్థ కు చెందిన విమానాశ్రయం కావడం, తూర్పు తీర నౌకాదళం చాలా వ్యూహాత్మకమైన ప్రాంతం కావడం తో అనేక ఆంక్షలు ఉంటుంటాయి. పాసింజర్ సర్వీస్ విమానాలకు చాలా తక్కువ స్లాట్స్ కేటాయిస్తుంటారు. ప్రయాణికులకు అవసరమైన సమయాలలో అసలు విమాన సర్వీసులు ఉండవ్, నేవీ విమానాలకు వెసులుబాటు దొరికినప్పుడు..

Visakhapatnam: విశాఖ విమానాశ్రయం మూసివేత? 11 గంటల నుంచి విశాఖకు నో విమానం..
Visakhapatnam Airport
Follow us on

విశాఖపట్నం విమానాశ్రయం భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. ప్రయాణీకుల కోసం ప్రత్యేక విమానాశ్రయం లేదు. రక్షణ శాఖ ఆధ్వర్యంలోని విమానాశ్రయాన్నే పాసింజర్ టెర్మినల్ గా కూడా వాడుతుంటారు. రక్షణ వ్యవస్థ కు చెందిన విమానాశ్రయం కావడం, తూర్పు తీర నౌకాదళం చాలా వ్యూహాత్మకమైన ప్రాంతం కావడం తో అనేక ఆంక్షలు ఉంటుంటాయి. పాసింజర్ సర్వీస్ విమానాలకు చాలా తక్కువ స్లాట్స్ కేటాయిస్తుంటారు. ప్రయాణికులకు అవసరమైన సమయాలలో అసలు విమాన సర్వీసులు ఉండవ్, నేవీ విమానాలకు వెసులుబాటు దొరికినప్పుడు మాత్రమే పాసింజర్ సర్వీస్ లకు అవకాశం ఉంటుంది. ఇన్ని ఇబ్బందుల నేపథ్యంలోనే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం విమాన ప్రయాణీకులు అంతా వేచి చూస్తున్నారు.

తాజాగా విమానాశ్రయంలో రన్ వే రీ సర్ఫేసింగ్ పనులు చేపట్టాలని నేవీ నిర్ణయించింది. ఇందుకోసం నవంబరు 15 నుంచి మార్చి 15 వరకు సమయం పడుతుందని, అప్పటివరకు రాత్రి వేళల్లో 9 నుంచి ఉదయం 8 వరకు పనులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎలాంటి పాసింజర్ సర్వీస్ లు నడపొద్దని, ఆమేరకు బుకింగ్స్ ఆపాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ కు నేవీ లేఖ రాసింది. ఆ సమయంలో విమానాల రాకపోకలను అనుమ తించబోమని నేవీ ఆధ్వర్యం లోని ఐఎన్ఎస్ డేగా నిర్వాహకులు ఎయిర్లైన్స్ సంస్థలకు కూడా తెలియజేశాయి. ఆ మేరకు విమానాల రాకపోకల షెడ్యూల్ మార్చుకోవాలని సూచించాయి. సాధారణంగా విమానయాన సర్వీసులు అక్టోబరు నెలాఖరు నుంచి వింటర్ షెడ్యూల్ కు ప్లాన్ చేసుకుంటాయ్. ఆ మేరకు మార్పులు ఉంటాయని విమానాశ్రయ వర్గాలు వెల్లడిస్తున్నాయి

రీ సర్ఫేసింగ్ అంటే..

రన్ వే రీ సర్ఫేసింగ్ అంటే విమానాలు రన్ వే పై లాండింగ్, అక్కడి నుంచే టేకాఫ్ తీసుకుంటుటాయన్న విషయం మనకు తెలిసిందే. అలాంటి కీలక మైన రన్ వే నిర్వహణ పట్ల కూడా ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది. పదేళ్లకొకసారి ఈ రన్ వే లను మరమ్మతులు చేస్తారు. పై లేయర్ ను కొత్తగా నిర్మిస్తారు. పై పొర ను తొలగించి, అవసరమైన చోటల్లా స్థిరంగా మరమ్మతులు చేస్తారు. కొత్తగా పై పొరను వేస్తారు. ఆ తరువాత దానిపై మార్కింగ్, లైటింగ్ వంటి పనులను చేపట్టే ప్రక్రియనే రీ సర్ఫేసింగ్ అని అంటారు. వాస్తవానికి డ్యూ ప్రకారం ఈ పనులను 2019లో నే చేపట్టాల్సి ఉంది. నేవీ అవసరాలు, అనంతరం కోవిడ్ లాంటి కారణాల వల్ల ఇంకా జరగలేదు. దాంతో ఆ రన్ వే రీసర్ఫేసింగ్ పనులను ఇప్పుడు చేపట్టాలని నేవీ నిర్ణయించింది.

ఆ 12 సర్వీసులకు ఇబ్బంది..

రీ సర్ఫేసింగ్ జరిగే సమయంలో రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకు రాకపోకలకు అనుమతించబోమని నేవీ అధికారులు తాజాగా ఇచ్చిన ఆదేశాల తో ఆ సమయం లో నడిచే హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, పూణే, ఢిల్లీ లాంటి 12 సర్వీసులపై ప్రభావం పడనుంది. అలాగే ప్రస్తుతం నడుస్తున్న ఒకే ఒక అంతర్జాతీయ విమానం సింగపూర్ విమానం కూడా ఆగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది.

రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి..

నేవీ తాజా నిర్ణయం పై రాజకీయ పార్టీలు స్పందించాయి. రాత్రి తొమ్మిది నుంచి ఉదయం 8 గంటల వరకు కాకుండా రాత్రి 10.30 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు అయితే విమానాల రాకపోకలపై పెద్దగా ప్రభావం ఉండదని, ఆమేరకు నిర్ణయం మార్చుకోవాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు తూర్పు తీర నేవీ కి లేఖ రాశారు. దీనిపై నేవీ స్పందించలేదు. కనీసం ఎయిర్లైన్స్ సంస్థలకు తెలియజేసి వాళ్ళ సూచనలను పరిగణలోకి తీసుకుని విమాన సమయాలు మార్చుకోవాలనైనా స్పష్టంచేశారు. దానికి నేవీ రెస్పాండ్ అవలేదు. తాజాగా 11 గంటల పాటు రాత్రి వేళల్లో మూసివేసే నిర్ణయాన్ని మార్చుకునేలా ఆదేశించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఆదిశగా ఒత్తిడి తెచ్చేందుకు అన్ని రాజకీయపార్టీలు కూడా సిద్దం అవుతున్నాయి. కనీసం 11 గంటల సమయాన్ని 8 గంటలకు కుదించి రాత్రి 10.30 నుంచి ఉదయం 6.30 వరకు ఆపితే బాగుంటుందన్న సూచనలను నేవీ పరిగణించాల్సి అవసరం ఉందని విమాన ప్రయాణీకులు కోరుతున్నారు.

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన విశాఖ అధికారులు..

తాజా నిర్ణయం మార్పుపై నేవీ అధికారులు స్పందించకపోవడంతో ఢిల్లీలోని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు విశాఖ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎస్ రాజారెడ్డి. వాళ్లు ఇండియన్ నేవీ అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయం ప్రకటిస్తారని ఆశిస్తున్నట్టు రాజారెడ్డి వివరించారు. తాజా ఆంక్షలు నవంబరు నుంచి కాబట్టి ఈలోగా ఆయా విమాన సంస్థలు షెడ్యూల్ మార్చుకునే అవకాశం ఉందని, ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని విశాఖ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..