
మామూలుగానే రాజకీయాల్లో ఇదిగో పులి అంటే అదిగో తోకన్నట్లు ఉంటుంది. అలాంటిది పదేపదే జరుగుతున్న ప్రచారం ఇద్దరు అధినేతల కలయికతో మరింత బలపడకుండా ఉంటుందా? ఏపీలో అదే జరుగుతోంది. చంద్రబాబు-పవన్‌కల్యాణ్ భేటీతో సైకిల్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. నో డౌట్.. ఇక ఫ్రెండ్‌షిప్ పక్కా అని ఫిక్సయిపోతున్నారట తమ్ముళ్లు. పవన్‌కల్యాణ్‌తో గతంలోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. హోటల్‌కొచ్చి మరీ కలిసి జనసేనానికి సంఘీభావం ప్రకటించారు. అయితే తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు కేడర్‌ని గందరగోళంలో పడేశాయి. చంద్రబాబును కలిసిన తర్వాత పవన్‌కల్యాణ్ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తర్వాత పవన్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలతో టీడీపీతో పొత్తు ప్రయత్నాలకు బ్రేక్‌పడిందన్న సంకేతాలు వెళ్లాయి. కానీ హైదరాబాద్‌లో తాజా మీటింగ్ తర్వాత ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య పొత్తు పొడుస్తోందంటున్నారు.
పొత్తులపై ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నా కేడర్‌కి మాత్రం నేతలనుంచి సంకేతాలున్నాయంటున్నారు. ఇద్దరి భేటీ తర్వాత వైసీపీ నాయకులకు పవన్ తరపున గట్టి కౌంటర్లు ఇచ్చారు టీడీపీ నేతలు. మరోవైపు చంద్రబాబు-పవన్‌కల్యాణ్ ఏం మాట్లాడుకున్నారు, ఎలా ముందుకెళ్లబోతున్నారన్న దానిపై రాష్ట్ర స్థాయి నాయకులకు ఫోన్లు చేసి ఆరాతీస్తున్నారట తమ్ముళ్లు.
పొత్తులపై ముందుగానే తేల్చేస్తే క్లారిటీ ఉంటుందంటున్నారు తమ్ముళ్లు. ఎన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుందో, ఎక్కడెక్కడ వదులుకోవాల్సి వస్తుందో ఓ అంచనా ఉంటే గందరగోళానికి తావుండదన్న మాట టీడీపీ నేతలనుంచి వస్తోంది. ఏపీలో 30 నియోజకవర్గాలకు టీడీపీ ఇంకా ఇంచార్జిలను నియమించలేదు. గ్రూపు తగాదాలతో పాటు, టికెట్‌కి పోటీ ఉన్నచోట లేనిపోని తల్నొప్పులు ఎందుకని ఇంచార్జిల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారట చంద్రబాబు. ఇప్పుడు పొత్తు తేలితే అలాంటి నియోజకవర్గాలపైనా ఓ క్లారిటీ రావచ్చంటున్నారు.
జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు.. ఎక్కడెక్కడ ఇస్తారన్నదానిపైనా అప్పుడే చర్చ మొదలైందని సమాచారం. ప్రధానంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేనకు ఎక్కువసీట్లు ఇచ్చే అవకాశం ఉందని కేడర్ చర్చించుకుంటోంది. అయితే ఇప్పటికే టీడీపీ ఇంచార్జిలు ఫుల్ ఫోకస్ పెట్టి పనిచేసుకుంటున్న సీట్లు ఇవ్వాల్సి వస్తే పరిస్థితి ఏంటన్నదానిపై తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. టీడీపీ, జనసేన రెండూ బలంగా ఉన్న చోట ఒకరికి సీటిస్తే మరొకరి పరిస్థితి ఏంటనే చర్చ కూడా రెండు పార్టీల్లో అప్పుడే మొదలైందట.
పొత్తుల అంశం అప్పుడే కాదని రెండు పార్టీల నేతలు దాటవేస్తున్నా ముందే తేలిపోతే బావుంటుందన్న మాట రెండువైపులనుంచీ వినిపిస్తోంది. చివరి నిమిషం దాకా పొత్తుల విషయం తేల్చకుంటే రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చి అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉందని తమ్ముళ్లు అంటున్నారు. పొత్తుల అంశంపై టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ నాయకులతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లు కొందరు చెబుతున్నారు. ఎక్కువకాలం సస్పెన్స్ పెట్టకుండా వీలైనంత త్వరగా పొత్తులపై నిర్ణయం తీసుకునేలా రెండు పార్టీల నాయకులు ముందుకెళ్తున్నారని చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం