Andhra Pradesh: పురాతన నిధి(Hidden treasure) బయటపడిన ఘటనలు మనం తరుచుగా చూస్తూనే ఉన్నాం. మాములుగా అయితే నిర్మాణాలు కోసం గుంతలు తీస్తున్నప్పుడు, తవ్వకాలు జరుపుతున్నప్పుడు పురాతన నిధి బయటపడుతూ ఉంటుంది. అయితే ఇంట్లో వాళ్లకు ఈ నిధి కనిపిస్తే సైలెంట్‌గా దాచేస్తారు. కూలీలకు కనిపించిందా..? ఇక వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరినట్లే. పక్కాగా పంపకాల్లో తేడా వస్తుంది. విషయం వెంటనే.. జనాలకు తెలిసిపోతుంది. తాజాగా విజయనగరం జిల్లాలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. రాజాం(Rajam) టౌన్‌లోని కంచర స్ట్రీట్‌లో ఓ పాడుబడిన ఇంటిని కూలుస్తుండగా గోడ నుంచి బరువైన పెద్ద బీరువా లాకర్ బయల్పడింది. అయితే కూలీలు లోపల గుప్త నిధి ఉన్నట్లు భావించారు. ఆ సంపదను కాజేయాలని స్కెచ్ వేశారు. లాకర్ బాక్స్ గురించి.. ఇంటి ఓనర్‌కు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఉంచారు. కానీ ఇలాంటి విషయాలు దాగి ఉండవు. యజమానికి ఉప్పు అందింది. దీంతో అతడు కూలీలను నిలదీశాడు. బాక్స్ తమదే అంటూ అటు ఓనర్‌తో పాటు కూలీలు గొడవకు దిగారు. ఆ బీరువా లోపల భారీగా గుప్త నిధి ఉన్నట్లు ప్రచారం జరుగింది. సమాచారం అందుకున్న రెవిన్యూ అధికారులు, పోలీసులు ఆ లాకర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. దాన్ని తెరిచేందుకు నానా అవస్థలు పడ్డారు. నాలుగు గంటలు శ్రమించినా ఓపెన్ కాకపోవడంతో.. గ్యాస్ కట్టర్ల సాయంతో ఓపెన్ చేశారు. ఈ క్రమంలో లోపల ఏముంటుందా అని ఉత్కంఠతో చూశారు రాజాం ప్రజలు. ఓపెన్ అయిన లాకర్‌లో పలు కాగితాలతో పాటు నాలుగు పురాతన నాణేలు ఉన్నాయి. బంగారు నిధి లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు ప్రజలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..