Andhra News: అమెరికాలో ఆంధ్ర కుర్రాడు మిస్సింగ్.. అసలు ఏం జరిగిందంటే?

ఉన్నత చదువుల కోసమని, ఉద్యోగాల కోసమని విదేశాలకు వెళ్తున్న భారతీయులు ఏదో ఒక ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు ఇటీవల చాలానే వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఏపీలోని పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన ఓ యువకుడు అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వరదల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు యువకుడి ఆచూకీ కనిపెట్టాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులకు లేఖలు రాశారు.

Andhra News: అమెరికాలో ఆంధ్ర కుర్రాడు మిస్సింగ్.. అసలు ఏం జరిగిందంటే?
Indian Student Missing Us

Edited By:

Updated on: Jun 28, 2026 | 8:40 PM

దేవరపల్లికి చెందిన దొప్పలపూడి రాంబాబు కుమారుడు వెంకటేష్ ప్రస్తుతం అమెరికాలోని ఒమాహా నగరంలో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాన్సాస్‌లోని వెల్లింగ్టన్ సమీపంలో వరదలు రావడంతో ఆలివర్ రోడ్‌లోని 600వ బ్లాక్ ప్రాంతంలో ఆయన కొట్టుకుపోయినట్లు తెలిసింది. ఘటనా స్థలంలో వెంకటేష్ ప్రయాణిస్తున్న కారు, కారులో ఉన్న బ్యాగు లభ్యమైనప్పటికీ, సెల్ ఫోన్,అతని ఆచూకీ ఇంతవరకు లభించలేదు.

అయితే ఈ విషయం తెలుసుకున్న పర్చూరి ఎమ్మెల్యే యువకుడి గల్లంతు విషయంలో తక్షణమే గాలింపు చర్యలు చేపట్టాలని, అమెరికా రాయబార కార్యాలయానికి విషయాన్ని తెలియజేయాలని ఎమ్మెల్యే కేంద్ర మంత్రులకు మూడు వేర్వేరు లేఖలు రాశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పర్చూరు ఎమ్మెల్యే రాసిన లేఖలో, తప్పిపోయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టేలా అమెరికా రాయబార కార్యాలయానికి సమాచారాన్ని పంపించాలని కోరారు.

రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కు రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ విషయాన్ని కేంద్రం, అమెరికా రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు రాసిన లేఖలో కూడా ఇదే అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

మూడు లేఖల్లోనూ వెల్లింగ్టన్‌లో సంభవించిన భారీ వరదల్లో దేవరపల్లి యువకుడు కొట్టుకుపోయినట్లు పేర్కొంటూ, బాధితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి, వివరాలను రాష్ట్రానికి తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే ఏలూరి సహాయ చర్యలు చేపట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us