
వందల ఏళ్ల అయోధ్య రామ మందిర నిర్మాణం సాకారమైంది. అత్యంత అట్టహాసంగా రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది. ఇక ఆ బాల రాముడిని దర్శించుకోవడానికి భారతదేశం నుంచే కాకుండా ప్రపంచనలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో అయోధ్యలో పెద్ద ఎత్తున భక్తులు చేరుతున్నారు.
ఇదిలా ఉంటే అయోధ్యకు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న తరుణంలో భారత రైల్వే సైతం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు ప్రధాన నగరాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అయోధ్యకు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా రైళ్లు అందుబాటులో ఉండగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అయోధ్యకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
గుంటూరు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక రైలును ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి రైలును ప్రారంభించారు. ఏపీ నుంచి అయోధ్యకు వెళ్తున్న తొలి రైలు ఇదే కావడం విశేషం. నిజానికి అంతకు ముందు అయోధ్యకు నేరుగా వెల్లడానికి రైల్లు అందుబాటులో లేవు. విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్లి, అక్కడి నుంచి మరో రైళ్లో అయోధ్యకు వెళ్లాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చిన రైళ్లతో నేరుగా అయోధ్య చేరుకోవచ్చు.
గుంటూరు నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక రైలు విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట తుని, అనకాపల్లి, విశాఖపట్నం మీదుగా అయోధ్యకు చేరుకుంటుంది. ఇక రెండో రైలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ రైలు సామర్లకోటలో ప్రారంభమై అనంతరం పిఠాపురం, తుని, అనకాపల్లి, విశాఖపట్నం పట్టణాలమీదగా అయోధ్యకు చేరుకోనుంది. ఒకేసారి రెండు రైళ్లు అయోధ్యకు అందుబాటులోకి రావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..