Andhra Pradesh: అక్కడ తలుపులు తీయాలంటే భయం భయం..గడప దాటి బయటకు రావాలంటే టెన్షన్..టెన్షన్..చిన్నపిల్లలను క్షణం వదిలిపెట్టాలన్నా వణికిపోవాల్సిందే..ఇంతకీ అక్కడి వారికి ఎందుకంత భయం ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం కాస్తా వానరవనంగా మారిపోయింది. కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. ఎటు చూసినా కోతుల మందే. ఇళ్లు, బడులు, ఆస్పత్రులు ఇలా ఎక్కడ చూసినా వానరాల గుంపే. మన చేతుల్లో ఏదైనా కనిపిస్తే చాలు..మీదబడి మరీ లాగేసుకుంటాయి. గుటుక్కున నోట్లో వేసుకుంటాయి. అంతే కాదు..ఇళ్లలోకి చొరబడి తినుబండారాలు ఎత్తుకెళ్తున్నాయి. ఆస్పత్రుల వద్ద కూడా బీభత్సం సృష్టిస్తున్నాయి. వాటికి ఎదురు తిరిగితే మీద పడి దాడి చేస్తున్నాయి.
రోడ్డున పోయేవారిపైనా కూడా అటాక్ చేసి గాయపరుస్తున్నాయి. తాజాగా మైలవరంలో కోతులు సృష్టించిన వీరంగం మామూలుగా లేదు. స్థానికులపై అటాక్ చేశాయి. కోతుల దాడిలో చిన్నారి డిస్నీకి గాయాలయ్యాయి. దీంతో మైలవరంలో రోజురోజుకీ కోతుల బెడద మరింత తీవ్రరూపం దాల్చుతోందని హడలెత్తిపోతున్నారు స్థానికులు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. భయంతో తలుపులు వేసుకొని బిక్కుబిక్కుమంటున్నారు. కోతుల భయంతో తలుపులు తెరవాలంటేనే భయమేస్తోందని..బయట నిలబడితే ఎప్పుడు తమపై దాడి చేస్తాయోనని వణికిపోతున్నారు.
ఇక చిన్న పిల్లల్ని వదిలిపెట్టాలంటేనే మరింత గజగజలాడిపోతున్నారు. గుంపులు గుంపులుగా వచ్చి చిన్నారులపై దాడులు చేస్తున్నాయని హడలెత్తిపోతున్నారు. అలాగే దగ్గర్లో ఉన్న షాపుకు వెళ్లి ఏమైనా తెచ్చుకుందామన్నా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణానికి వెళ్లి వస్తువులు తెచ్చుకోవాలన్నా భయమేస్తోందంటున్నారు. ఇక చిరు వ్యాపారుల కష్టాలైతే వర్ణణాతీతంగా మారాయి. పండ్ల దుకాణాలు పెట్టుకుంటే..దాడి చేసి లాక్కెళ్తున్నాయని..తమ పరిస్థితి మరింత దయనీయంగా మారిందంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని తమను కాపాడాలని వేడుకొంటున్నారు మైలవరం వాసులు.