మనిషి అయినా, జంతువులు అయినా.. తల్లి తల్లే. తన పిల్లల కోసం పరితపించిపోతుంటుంది. పిల్లలు ప్రమాదంలో పడితే.. తన ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతుంది. తన వల్ల కాకపోతే ఇతరుల సాయం తీసుకుంటుంది. తాజాగా ఓ తల్లి కుక్క తన పిల్లలు ప్రమాదంలో పడటంతో అల్లాడిపోయింది. ఎలాగైనా తన పిల్లలను కాపాడుకోవాలని పరితపించింది. తన వల్ల కాకపోవడంతో.. ఆ పక్కనే పోలీసులను వేడుకుంది. వారి చుట్టూ తిరుగుతూ.. తన మౌన రోధనను వారికి అర్థమయ్యేలా చేసింది. చివరకు తన ప్రయత్నం ఫలించింది.. పిల్ల కుక్కకు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాయి. వాటిని రక్షించిన ఖాకీలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు జనాలు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తింది. అయితే, ఈ వరదల్లో కుక్క పిల్లలు చిక్కుకుపోయాయి. తల్లి కుక్క ఆహారం కోసం బయటకు వెళ్లి వచ్చేలోగా.. వరద ముంచెత్తింది. దాంతో పిల్ల కుక్కలు అక్కడే ఉండిపోయాయి. తల్లి కుక్క వచ్చేసరికి వరద ప్రవాహం ఎక్కువైంది. తన పిల్లలను సమీపించలేకపోయింది. వాటిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయితే, దాని ప్రయత్నం ఫలించలేదు. చివరకు ఆ పక్కనే ఉన్న పోలీసుల చుట్టూ తల్లి కుక్క తిరిగింది. దాని మూగ బాధను అర్థం చేసుకున్న పోలీసులు.. దాని వెంట వెళ్లారు. ఇంట్లో చిక్కుకుపోయిన కుక్క పిల్లలను రక్షించాయి.
కుక్క పిల్లలను వరద ప్రాంతం నుంచి బయటకు తీసుకువచ్చి తల్లి కుక్క చెంతకు చేర్చారు. దాంతో అది ప్రేమతో పొంగిపోయింది. తన పిల్లలు తన చెంతకు చేరడంతో సంతోషించింది. పోలీసుల పట్ల కృతజ్ఞత ప్రదర్శించింది. ఆ తరువాత తన పిల్లలను నోట కరుచుకుని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది తల్లి కుక్క. కాగా, వరదలో చిక్కుకున్న కుక్క పిల్లలను కాపాడిన పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు. ఇక ఆ తల్లి కుక్క అయితే, పోలీసుల వాహనం వెంట కాసేపు వెళ్లింది. ఆ తరువాత తిరిగి తన పిల్లల వద్దకు చేరింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..