Andhra Pradesh: కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువుకు భారీగా గండి పడింది. పెద్ద తూము సమీపంలో చెరువు కట్టకు చిన్న చిన్న గండిల కారణంగా భారీ స్థాయిలో నీరు లీక్ అవుతోంది. నీరంతా వృధాగా పోతోంది. ఉదయం నుంచి లీకేజీ స్థాయి క్రమంగా పెరుగుతోంది. విషయం తెలుసుకున్న వివిధ శాఖల అధికారులు.. లీకేజీలను పరిశీలించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. లీకేజీ పూడ్చివేతకు సన్నాహాలు మొదలు పెట్టారు. సిద్దాపురం చెరువులో ఒక టీఎంసీ మేరకు నీరు నిల్వ ఉంది. కాగా, లీకేజీల కారణంగా చెరువు కింది పంట పొలాలు నీట మునిగాయి. మరోవైపు చెరువుకు గండితో ఆత్మకూరు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇదిలాఉంటే.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెయ్యేరు నదికి ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా కపడ జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయింది. దాంతో వరద ప్రవాహం ఒక్కసారిగా దిగువన గ్రామాల్లోకి ప్రవేశించింది. నందలూరు, రాజంపేట మండలాల్లోని 9 గ్రామాలు జలమయం అయ్యాయి. ఎంతో మంది ఆ వరదలో కొట్టుకుపోయారు. అధికారిక లెక్కల ప్రకారం దదాపు 18 మంది చనిపోగా.. 50 మందికిపైగా గల్లంతయ్యారు. ఈ సంఖ్య అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా. ఇంతటి ఘోర పరిస్థితిని చూసిన నేపథ్యంలో.. ఇప్పుడు సిద్దాపురం చెరువుకు గండి పడటం.. దిగువ గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
Also read:
Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..
Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం