Guntur: నేనుండి మాత్రం ఏం చేయాలి.. భర్త చనిపోయాడని భార్య బలవన్మరణం
కడదాకా తోడుంటానని పెళ్లినాట చేసిన ప్రమాణాలు నీటిమూటలయ్యాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంట.. పిల్లలు లేకపోయినా ఒకరికొకరు అంటూ అన్యోన్యంగా జీవించారు. ఆర్థిక సమస్యలు, వృద్ధాప్యంతో పాటు భర్త అనారోగ్యం....
కడదాకా తోడుంటానని పెళ్లినాట చేసిన ప్రమాణాలు నీటిమూటలయ్యాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంట.. పిల్లలు లేకపోయినా ఒకరికొకరు అంటూ అన్యోన్యంగా జీవించారు. ఆర్థిక సమస్యలు, వృద్ధాప్యంతో పాటు భర్త అనారోగ్యం పాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇన్నాళ్లు చేయిపట్టుకుని నడిచిన భర్త.. ఇక లేడన్న నిజం తెలుసుకుని ఆ ఇల్లాలు తట్టుకోలేకపోయింది. అంత్యక్రియలకూ డబ్బు లేకపోవడంతో తల్లడిల్లింది. తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చివరికి స్వచ్ఛంద సంస్థ సభ్యులతో భర్తకు అంత్యక్రియలు చేయించింది. ఆర్థిక, మానసిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహిళకు ఓల్జేజ్ హోం లో చేరుస్తామన్న ట్రస్ట్ సభ్యుల మాటలు సాంత్వన కలిగించలేకపోయాయి. పిల్లలు లేరు.. భర్త లేడు.. ఇక తానెందుకు బతకాలని రోదిస్తూ తాను కట్టుకున్న చీరతో గేటుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
గుంటూరులోని కన్నావారితోట ప్రాంతానికి చెందిన వెంకట రమణారావు, సువర్ణ రంగలక్ష్మి దంపతులు. వీరికి పిల్లలు లేరు. రమణారావు అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి చికిత్స అందించేందుకు రంగలక్ష్మి ఈ నెల 19న గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన అర్ధరాత్రి మృతి చెందారు. మృతి చెందిన భర్తకు అంత్యక్రియలు చేసేందుకూ డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రంగలక్ష్మి ఆసుపత్రిలోనే ఆత్మహత్యకు యత్నించారు. ఆసుపత్రి సిబ్బంది గుర్తించి, ఓ స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇచ్చారు. వారు ఆస్పత్రి వద్దకు చేరుకుని రంగలక్ష్మిని ఓదార్చారు. తామే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ధైర్యం చెప్పారు. భర్త చనిపోయిన ఇంట్లోకి తాను వెళ్లలేనంటూ రంగలక్ష్మి కన్నీటిపర్యంతమయ్యారు. పిల్లల్లేరు.. భర్త చనిపోయాడు. ఇక నేనెందుకు బతకాలంటూ రోదించింది. రంగలక్ష్మిని తాము అనాథాశ్రమంలో చేర్పించి బాగోగులు చూసుకుంటామని ట్రస్టు సభ్యులు నచ్చజెప్పారు.
రమణారావు మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు. తెల్లారాక ఆశ్రమానికి తీసుకెళతామంటూ తెల్లవారుజామున 3 గంటలకు ట్రస్టు సభ్యులు రంగలక్ష్మిని ఇంటి దగ్గర దిగబెట్టారు. అప్పటికే తీవ్ర మనస్తాపానికి గురైన రంగలక్ష్మి ఇంటి లోపలికి వెళ్లకుండా చీరతో గేటుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న ట్రస్టు సభ్యులు ఆమె మృతదేహానికి శవపరీక్ష చేయించి, భర్త చితి పక్కనే అంత్యక్రియలు నిర్వహించారు.
Also Read
Beast: ఈ సారి దళపతి విజయ్‌ను దించేసిన టాంజానియా కుర్రాడు.. వీడియో వైరల్
VK Sasikala: శశికళను చుట్టుముడుతున్న కష్టాలు.. పోలీసుల నుంచి మళ్లీ పిలుపు.. ఎందుకోసమంటే..!