ధరలు పెరుగుతున్నాయి అనే మాట వినగానే సామాన్యుల గుండెలు గుబేల్ మంటున్నాయి. మొన్నటి మొన్న టమాట ధరలు ప్రజలకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. టమాట పేరు తీయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. కిలో టమాట ధర ఏకంగా రూ. 200 వరకు చేరింది. దీంతో టమాట కొనడమే ఆపేశారు. అయితే ఆ తర్వాత ధరలు మళ్లీ క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు ఉల్లి కూడా ఇదే దారిలో వెళుతోంది.
సాధారణంగా ఉల్లి లేనిదే జిహ్వ తృప్తి చెందంటారు.. వంటకు ఉపయెగించే ఉల్లి అందరికి అవసరమైన నిత్యావసర వస్తువు… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రిటైల్ మార్కెట్లో సైజుతో పనిలేకుండా ఉల్లి పాయల ధరలు కిలో రూ.60 నుంచి రూ.86 వరకు విక్రయిస్తున్నారు. ఇక సూపర్ మార్కెట్లు, ఇతర మాల్స్ లో అయితే కిలో నికరంగా రూ.90 వరకు పలుకుతుంది, రైతు బజారులు సైతం ప్రాంతాల వారిగా ఉల్లి ధరలు ఉంటున్నాయి. వీటిలో కిలో ఉల్లి ధర రూ38 నుంచి రూ.46 వరకు పలుకుతోంది.
వినియోగదారులకు ఇక్కడ కిలో నుంచి రెండు కిలోల వరకు పరిమితంగా ఇస్తున్నారు. కార్పోరేట్ వాణిజ్యరంగంలో వ్యాపార పరంగా డిమాండ్ ఉన్న చిన్న ఉల్లి ధరలు మధ్యతరగతి కుటుంబాల జీవనానికి తగినట్లుగానే కిలో రూ.100 వరకు పలుకుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో అక్టోబరు, నవంబరు నెలల నుంచి ఉల్లిధరలు పూర్తిగా వినియోగదారునికి అనుకూల రీతిలో ఉంటాయి. అయితే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వాతావరణ అననుకూల పరిస్థితుల కారణంగా లోడ్ దిగుబడి కాకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.
ఆంధ్రాకు ప్రధాన ఉల్లి ఉత్పత్తిదారుగా ఉన్న కర్నూలులో వాతావరణ అననుకూలత, దసరా సెలవుల ప్రభావం ఉందంటున్నారు. ఇక్కడనుంచి ఉల్లి ఎగుమతులు సరిగ్గా అవసర సమయంలో పండుగ సీజన్ లో ఆగడం వలన ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. మరో వారంలో ఉల్లిధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు అభిప్రా యపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..